ఆమెకు అండగా ఉన్నందుకు.. నన్ను ఆ దర్శకుడు బెదిరిస్తున్నాడు : హీరో సిద్దార్థ్
దేశవ్యాప్తంగా ‘మీటూ’ ఉద్యమం ముదురుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ, సినీ ప్రముఖులు ఈ ఉద్యమానికి మద్దతు పలికారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి మేనకా గాంధీ స్పందించి కమిటీని ఏర్పాటు చేస్తునట్టు ప్రకటించారు. నడిగర్ సంగం ప్రధాన కార్యదర్శి, నటుడు విశాల్ ‘మీటూ’ ఉద్యమానికి పూర్తి మద్దతు తెలపగా.. తాజాగా హీరో సిద్ధార్థ్ సైతం ‘మీటూ’ బాధితులకు అండగా నిలిచారు. తమిళ దర్శకుడు సుశి గణేశన్ తనను వేధించారని.. బుల్లితెర యాంకర్‌గా కెరీర్ ప్రారంభించినప్పుడు దర్శకుడు సుశి గణేశన్ నన్ను కారులో ఉంచి లాక్ చేశారని నటి, రచయిత లీనా మణిమేఖలై ఆరోపించారు. ఈ విషయంలో నాతోపాటు మరికొందరు గళంకలుపుతారని ఆశిస్తున్నా.. అంటూ లీనా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆమె పోస్టుపై స్పందించారు సిద్దార్ధ్.. 'నేను నీకు మద్దతుగా ఉంటాను లీనా. నీ గళం అందరికీ వినిపిస్తుంది. నీ ధైర్యం అందరికీ ఆదర్శవంతం' అని ట్వీట్ చేశారు. దాంతో సిద్దార్థకు దర్శకుడినుంచి బెదిరింపులు మొదలయ్యాయట. ఈ విషయాన్నీ స్వయంగా సిద్దార్ధ్ ట్విట్టర్ వేదికగా చెబుతూ.. 'సుశి గణేశన్ వయసుపైబడిన నా తండ్రితో ఫోన్‌లో మాట్లాడారు. లీనాకు మద్దతుగా ఆమెవైపు ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ఆయన గురించి అందరూ తెలుసుకోవాలి. నేను లీనాకు మద్దతుగానే ఉంటా. ధైర్యంగా పోరాడు సోదరి' అంటూ సిద్దార్ధ ప్రతిస్పందించారు.