తెలంగాణలో ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకే ప్రచారం ముగియబోతుండడంతో.. అభ్యర్థులు నియోజకవర్గంలో హడావుడి పర్యటనలు చేస్తూ ఓట్లు అభ్యర్తిస్తున్నారు. ఈ నెల 7న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో.. ఎన్నికల నియమావళి ప్రకారం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగించాలి.. అసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం, సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకే ప్రచారం నిలిపివేయాలి. మిగతా నియోజకవర్గాల్లో 5 గంటల తర్వాత మైక్‌లు, లౌడ్ స్పీకర్లు బంద్ అవుతాయి.
పోలింగుకు 48 గంటల ముందు బల్క్ SMS , మద్యంపై నిషేధం ఉంటుంది. ఇక ఓటరు గుర్తింపు కార్డు లేని వారు 12 రకాల ప్రత్యామ్నాయ కార్డులను చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పోస్టాఫీస్ పాసు పుస్తకం, పాన్ కార్డు లాంటివి చూపించి ఓటు వెయ్యొచ్చు. 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసాక.. సర్వేల ఫలితాలు వెల్లడించుకోవచ్చు. అలాగే ఎవరైనా మద్యం సేవించి ఓటు వేయడానికి వస్తే.. మాత్రం జైలుకు వెళ్లాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.