బలమైన బంధం

Update: 2017-09-18 15:12 GMT

అంత‌ర్జాతీయ‌ సంబంధాల విషయంలో భారత్ మరో ముందడుగు వేసింది. కేవలం బుల్లెట్ ట్రైన్ ఒక్కటే కాదు.. జపాన్‌తో పలు విధాలుగా సంబంధాలు మెరుగుపరుచుకుంది. భారతదేశంలో రవాణా విషయంలో అతి పెద్ద ముందడుగు అయిన బుల్లెట్ ట్రైన్‌కు ఇరు దేశాల ప్రధానమంత్రులు నరేంద్రమోదీ, షింజో అంబే కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రెండు రోజుల పర్యటనలో షింజో అబే భారతదేశంతో బాగా కలిసిపోయారు. స్వయంగా తాను కుర్తా పైజమా ధరించి నెహ్రూ జాకెట్ వేసుకోవడంతో పాటు తన భార్యతో కూడా సల్వార్ కమీజ్ వేయించారు. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. భారత స్వాతంత్య్ర సంగ్రామ విశేషాలను స్వయంగా చూసి తెలుసుకున్నారు. బాపూ ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ ఆయన వడికిన చరఖా చూసి మురిసిపోయారు. మోదీ దూరదృష్టిగల నేత అని, నవ భారత నిర్మాణం కోసం ఆయన నిర్ణయం తీసుకున్నారని, అందుకు భాగస్వామిగా తమ దేశాన్ని ఎంపిక చేశారని చెప్పారు. బలమైన భారతదేశం వల్ల జ‌పాన్‌కు మేలు జరుగుతుందని, బలమైన జపాన్ వల్ల భారతదేశానికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. తాను, మోదీ జై జపాన్ - జై ఇండియా సాకారానికి కృషి చేస్తామన్నారు.
 
బుల్లెట్ రైలు ఏర్పాటుకు దాదాపు 1.10 లక్షల కోట్ల వరకు ఖర్చవుతుంది. అహ్మదాబాద్ నుంచి ముంబై నగరానికి గల 508 కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండు గంటల్లోనే అధిగమించే ఈ రైలు వల్ల రెండు రాష్ట్రాల మధ్య వాణిజ్యం, ఇతర వ్యవహారాలు మరింత ముందడుగు వేస్తాయి. దానికి తోడు వాణి జ్యపరంగా అది విజయవంతం అయితే భవిష్యత్తులో భారతదేశంలో రవాణా రూపురేఖలు సమూలంగా మారిపోతాయి. బుల్లెట్ రైలుకు కేవలం సాంకేతిక పర మైన సహకారం అందించడం, కాంట్రాక్టు తీసుకోవడమే కాక... అందుకు కావల్సిన ఆర్థిక వనరులలో సింహ భాగాన్ని కూడా అత్యంత తక్కువ వడ్డీకి జపాన్ రుణంగా అందిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం జపాన్ రూ.8 8 వేల కోట్లు రుణం ఇస్తోంది. 0.1 శాతం వడ్డీ రేటుతో ఈ అప్పును ఇస్తోంది. 50 ఏళ్ల కాల పరిమితిలో దీనిని తిరిగి చెల్లించవలసి ఉంటుంది. 15 సంవత్సరాల తర్వాత తిరిగి చెల్లింపు మొదలవుతుంది. 2022 నుంచి బుల్లెట్ రైలు సేవలు ప్రారంభం అవుతాయి. అంటే మరో ఐదేళ్లు. అప్పటినుంచి పదేళ్ల పాటు దాన్ని వాణిజ్యపరంగా విజయవంతంగా నడి పించాలి. ఆ తర్వాత మాత్రమే అప్పు తిరిగి చెల్లించడం మొదలుపెట్టాలి. కాబట్టి కావల్సినంత సమ యం ఉంటుంది. అందుకే.. బుల్లెట్ రైలు మన దేశానికి జపాన్ ఇస్తున్న గొప్ప బహుమానమని మోదీ పేర్కొన్నారు. తాను మరోసారి భారతదేశానికి వచ్చినపుడు మోదీతో కలిసి బుల్లెట్ రైలులో ప్రయాణిస్తానని షింజో అబె అనడం చూస్తుంటే అది చాలా డిప్లొమాటిగ్గా అన్నట్లు కూడా అనిపిస్తుంది. అప్పటివరకు మోదీయే ఇక్కడ ప్రధానిగా ఉంటారని, తాను కూడా జపాన్‌లో అంతవరకు ప్రధాన మంత్రి పదవిలో కొనసాగుతానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తామిద్దరం చేస్తున్న అభివృద్ధి పనులు, అంతర్జాతీయ సంబంధాలు.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తమకు ప్రజాదరణ ఉంటుందన్న కోణంలో ఆయన మాట్లాడారు. మోదీ ముందు చూపు ఉన్న నేత అని.. అందుకే మేకిన్ ఇండియా కలను సార్థకం చేసుకోడానికి తమలాంటి దేశాన్ని భాగస్వామిగా ఎంచుకున్నారని చెప్పారు. నిజానికి భారతదేశానికి బుల్లెట్ రైలు ఇవ్వడానికి చైనా, అమెరికా లాంటి దేశాలకు చెందిన కంపెనీలు కూడా పోటీ పడ్డాయి. కానీ భారత్ మాత్రం వ్యూహాత్మకంగా జపాన్ దేశాన్నే భాగస్వామిగా ఎంచుకుంది. ఇందుకు చాలా కారణాలున్నాయి. 

చాలా కాలంగా రష్యా లాంటి దేశాన్ని మిత్ర దేశంగా చూస్తున్నా, కేవలం ఆ ఒక్క దేశం తోనే వెళ్తే చాలదని భారత్ గుర్తించింది. అందుకే మరో బలమైన భాగస్వామి ఉండటం మంచిదని భావించి జపాన్ అన్నిరకాలుగా మేలని ఎంచుకుంది. ఈ నిర్ణయం నూటికి నూరుపాళ్లు తెలివైనదని తేలింది. కేవలం బుల్లెట్ రైలుతోనే తమ ప్రయాణం ఆగబోదని, భవిష్యత్తులో కూడా భారత్తో మరిన్ని వాణిజ్య పరమైన ఒప్పందాలు చేసుకుంటామని షింజో అబె చెప్పారు. భారత్కు ఏం కావాలంటే అది చేస్తామ న్నారు. అణు ఇంధనం విషయంలోను, టెక్నాలజీ విషయంలోను జపాన్ మిగిలిన అన్ని దేశాల కంటే నాలుగడుగులు ముందుంది. అలాంటి దేశాన్ని భాగస్వామిగా ఎంచకోవడం వల్ల వాళ్ల నుంచి మనకు సాంకేతిక పరిజ్ఞానం అందడంతో పాటు.. ఇక్కడ వాళ్ల పెట్టుబడులు పెంచేందుకు కూడా అవకాశం ఏర్పడింది. గుజ‌రాత్‌లోని సుజుకి కర్మాగారం ప్రస్తుతం ఏటా 2.5 లక్షల కార్లమను ఉత్పత్తి చేస్తుండగా, ఈ సామ ర్థ్యాన్ని 7.5 లక్షల కార్లకు పెంచుతామని షింజో అబె తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఆటోమొబైల్ బ్యాటరీలను తయారు చేసేందుకు తోషిబా, సుజుకి డెన్సో సంయుక్తంగా కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తా యన్నారు. వారణాసిలో ఇంటర్నేషనల్ కోఆపరేషన్, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు నిధులు అందజేస్తామని తెలిపారు. ఇలా అన్ని రంగాలలో మనతో కలిసి పయనించేందుకు జపాన్ సిద్ధపడుతోంది. ఇది అన్నిరకాలుగా మనకు మంచిదే అవుతుంది. 

అయితే దీనికి ముందడుగు ఇప్పుడు పడింది కాదు.. దీనికి పునాది ఎప్పుడో చాలాకాలం క్రితమే పడింది. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జపాన్‌లో పర్యటించారు. అప్పుడే ఆయన గుజరా త్‌లో మినీ జపాన్‌ను చూడాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పుడు అదే అవుతోంది. జపనీస్ కంపెనీలు అంత పెద్ద స్థాయిలో వస్తాయంటే గుజరాత్ రాష్ట్రంలో ఒక చిన్న స్థాయి జపాన్ కనిపిస్తుంది. వైబ్రెంట్ గుజ రాత్ సదస్సులో గుజరాత్ రాష్ట్రంతో తొలిసారిగా వాణిజ్య ఒప్పందానికి వచ్చినది, భాగస్వామ్యం కుదుర్చుకున్నది జపానే. అయితే.. కేవలం ఒక్క గుజరాత్‌తోనే మొత్తం బంధాన్ని సరిపెట్టేయకుండా.. దీన్ని మరింత విస్తరించేందుకు ఉత్తరాదిలో గుజరాత్, రాజస్థాన్, దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను ఎంపిక చేశారు. ఈ నాలుగు రాష్ట్రాలలో జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ రానున్నాయి. ఇవన్నీ సాకారమైతే ఇరు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరుగుతుంది. 

జపాన్‌లో అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉంది. వాళ్లు గుండుసూది నుంచి మోటారు కార్ల వరకు, అణు ఇంధనం సైతం ఉత్పత్తి చేయగలరు. కానీ, అక్క డ తగినంత మానవ వనరులు లేవు. ముందునుంచి కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల అక్కడ వృద్ధుల జనాభా బాగా ఎక్కువైపోయింది, పనిచేసేవారు తక్కువైపోయారు. అందువల్ల సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా.. ఉత్పత్తి రంగంలో అంత దూకుడుగా వెళ్లలేకపోతోంది. ఇలాంటి సమయంలో ఆ దేశానికి భారత్ లాంటి భాగస్వామి లభించడం ఒక రకంగా అదృష్టమే. మన దేశంలో అపార మానవ వనరులున్నాయి. వాళ్ల పరిజ్ఞానం మొత్తాన్ని ఇక్కడకు తీసుకొచ్చి, ఇక్కడ ఉత్పత్తి చేసి, ఇక్కడి నుంచే ఎగుమతులు చేయడం ద్వారా రెండు దేశాలకు ఆర్థిక, వాణిజ్య పరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ విషయాన్ని స్వయంగా షింజో అబె కూడా తన ప్రసంగంలో తెలిపారు. మొదటిరోజు అహ్మదాబాద్‌లో మోదీతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నపుడు.. తమ వద్ద పటిష్టమైన సాంకేతికత, వాటిని నిర్వహించే సంస్థలున్నాయని ఆయన అన్నారు.

భారత్లో తిరుగులేని మానవ వనరులు ఉన్నాయని చెప్పారు. ఈ రెండింటిని కలిపితే ప్రపంచంలో ఇరు దేశాలు తిరుగులేని విజయాలను సాధిస్తాయని చెప్పారు. భారత్-జపాన్ల మధ్య బంధం పరస్పర నమ్మకం మీద ఏర్పడిందని ఆ దేశ ప్రధాని అన్నారు. భారత సినీ నటులకు తమ దేశంలో మంచి ఆదరణ ఉందని తెలిపారు. ఇలా భారత దేశాన్ని పూర్తిస్థాయిలో స్వాగతించేందుకు జపాన్ సిద్ధ‌మైపోయింది. అది ఆ దేశానికి తప్పనిసరి. మనకు బుల్లెట్ రైలు పరిజ్ఞానం అందించినా, అందుకు అప్పు కూడా ఇచ్చినా అవన్నీ తమ దేశాన్ని అభివృద్ధి చేసుకో డానికి వేసుకుంటున్న మెట్లు మాత్రమే. మనకేదో మేలు చేస్తున్నామని కాకుండా.. తమ ప్రయోజనాలు కూడా అందులో ఉన్నాయన్న విషయాన్ని షింజో అబె ఒప్పుకోవడం ఒక రకంగా మంచి పరిణామం. 

ఇంధనేతర రంగాల్లో భారత్, జపాన్ అణు సహకారం చేసుకోనున్నాయని ఓ సీనియర్ ప్రభుత్వాధికారి తెలిపారు. ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్ కంపెనీలు అణు విద్యుత్ కర్మాగారాల విషయంలో ఒప్పందాలు చేసుకున్నాయి కాబట్టి, ఇతర అణు రంగాల్లో సహకారం ఉంటుందన్నారు. అంటే పరోక్షంగా అది అణు బాంబు పరిజ్ఞానం అనే అనుకోవాలి. అణుశక్తితో ప్రధానంగా చేయగల పనులు రెండే. అవి.. ఒకటి విద్యుత్ పుట్టించడం, రెండు విధ్వంసం సృష్టించడం. ప్రస్తుతం చైనా, పాకిస్తాన్‌లతో మనకు తీవ్ర ఉద్రిక్తతలున్నాయి. చైనా మనతోపాటు జపాన్‌కు కూడా ఒకరకంగా శత్రు దేశమే. అందుకే మనం జపాన్‌తో చేతులు కలు పుతుంటే చైనా తీవ్రంగా మండిపడు తోంది. శత్రువు శత్రువు మిత్రుడు అయినట్లు ఇలా కూడ జపాన్ మనకు దగ్గరవుతోందని వాళ్ల భయం. అణు పరిజ్ఞానం జపాన్ వద్ద కావల్సినంత ఉంది. అందులోనూ రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ నగరాలు హిరోషిమా, నాగసాకి అణు బాంబు దెబ్బ రుచి చూసినవే. భారతదేశం కూడా అణు బాంబులను ప్రయోగించాలని అనుకోవడం లేదు. కానీ, మనల్ని శక్తిహీనులుగా భావించి తమవద్ద ఉన్న ఆయుధ సంప త్తితో భయ పెట్టాలని చైనా లాంటి దేశాలు చూస్తే.. అందుకు చెప్పు దెబ్బలాంటి సమాధానం ఇవ్వడానికి అణ్వస్త్రాలను కూడా భారత్ సమకూర్చుకోవాలి. వాటి బూచి చూపించి అయినా చైనాను భయపెట్టే అవకాశం ఉంటుంది. అందుకు జపాన్ కూడా సహకారం అందిస్తోందన్న విషయం చెప్పీ చెప్పకుండా చెప్పారు. 

సాధారణంగా ఏదైనా దేశానికి చెందిన అత్యున్నత స్థాయి బృందం వచ్చినపుడు వాళ్లతో జరిగిన అన్నిరకాల ఒప్పందాల వివరాలను బయటపెట్టరు. కేవలం 15 రకాల ఒప్పందాలు కుదిరాయని మాత్రమే ఈసారి కూడా చెప్పారు. వాటిలో ఈ అణు ఒప్పందం కూడా ఒకటి. అందుకే చైనా కూడా ఈ రెండు దేశాల బంధాన్ని చాలా నిశితంగా గమనిస్తోంది. అమెరికాతో 2008లో భారత్కు పౌర అణు ఒప్పందం కుదిరిన అనంతరం... రష్యా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తదితర దేశాలు కూడా ఆ పని చేశాక జపాన్ కూడా మనతో కలవడంలో ఆశ్చర్యమేముందని అనిపించవచ్చు.

అణు ఒప్పందం విషయంలో మిగిలిన దేశాలకూ, జ‌పాన్‌కు తేడా ఉంది. మనం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)పై సంతకం చేయక పోయినా అమెరికా అందుకు మనతో ఒప్పందానికి అంగీకరించింది. మిగిలిన దేశాలు సైతం ఆ బాటలోనే వెళ్లాయి. కానీ 1945 ఆగస్టులో అమెరికా ప్రయోగించిన అణు బాంబులతో తీవ్రంగా దెబ్బతిన్న జపాన్.. ఆరేళ్ల తర్వాత గానీ ఈ ఒప్పందం చేసుకోడానికి సిద్ధం కాలేకపోయింది. ఎన్పీటీలో లేని ఒక దేశంతో జపాన్ అణు ఒప్పందానికి రావడం ఇదే మొదలు. పాకిస్తాన్ను దృష్టిలో పెట్టుకుని మన సభ్యత్వానికి మోకాలడ్డుతున్న చైనాను ఈ పరిణామం పునరాలోచనలో పడేస్తుంది. ఈ రకంగా ఇటుజపాన్‌తో బంధాన్ని బలోపేతం చేయడంతోపాటు చైనాకు చెక్ పెట్టడానికి కూడా షింజో అబె భారత పర్యటన ఉపయోగపడింది.

చంద్ర‌శేఖ‌ర శ‌ర్మ‌

Similar News