ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది జనసేన పార్టీలోకి క్రమంగా వలసలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రాల మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహర్, అలాగే మాజీమంత్రి పసుపులేటి బాలరాజు జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. తాజాగా టీడీపీకి చెందిన మాజీ మంత్రి, పత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు జనసేనలో చేరే అవకాశమున్నట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా టీడీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు రావెల. రెండేళ్ల కిందటే పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. కానీ కొందరు బుజ్జగింపులతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం పార్టీ మారాలని దాదాపు నిర్ణయానికి వచ్చారు. అయితే మొదట ఆయన వైసీపీని సంప్రదించారు. కానీ ప్రత్తిపాడులో మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ఉండటంతో రావెల చేరికకు జగన్ బ్రేకులు వేశారు. ఈ క్రమంలో ఆయన జనసేన వైపు దృష్టి సారించారు. పవన్ కళ్యాణ్ సైతం రావెల చేరికకు పచ్చజెండా ఊపినట్టు సమాచారం. రేపు(డిసెంబర్ 1) ఆ పార్టీలో చేరే అవకాశముంది. మరోవైపు రావెల కిషోర్ బాబు పార్టీ మారుతున్నారన్న సమాచారంతో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. కీలక నేతలు రంగంలోకి దిగి ఆయనను బుజ్జగిస్తున్నారు.