రైలు ప్ర‌మాదాలు ఆగేదెలా?

Update: 2017-09-18 11:36 GMT

రైల్వేబోర్డు చైర్మన్ రాజీనామా చేసినా ఆగలేదు.. ఏకంగా మంత్రిగారి శాఖను మార్చినా ప్రయోజనం కనిపించలేదు. రైళ్లు పట్టాలు తప్పుతూనే ఉన్నాయి. ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సాంకేతికంగా ఎంత ముందడుగు వేసినా, ఈ ఒక్క విషయంలో మాత్రం ప్రగతి చూపిం చలేకపోతున్నాము. విద్రోహచర్యలే కారణం అవుతున్నాయో, పట్టాల నిర్వహణలో వైఫల్యమే దారితీస్తోందో గానీ ప్రమాదాలు మాత్రం వరుసపెట్టి సంభవిస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రమాదాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. ఒకవైపు ఆస్పత్రులలో మరణాలు, మరోవైపు రైలు ప్రమాదాలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. గత నెలలో వరుసపెట్టి నాలుగు రోజుల్లోనే రెండు పెద్ద రైలు ప్రమాదాలు సంభవించగా, తాజాగా గురువారం మరో రైలు పట్టాలు తప్పింది. హౌరా-జబల్ పూర్ మధ్య నడిచే శక్తికుంజ్ ఎక్స్ ప్రెస్ సోన్ బాంద్రా వద్ద ప్రమాదానికి గురైంది. గురువారం తెల్లవారుఝామున ఒబ్రా రైల్వే స్టేషన్ వద్ద రైలుకు సంబంధించి ఏడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెబుతున్నారు. పట్టా విరిగిపోయి ఉండటంతో ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సురేష్ ప్రభు నుంచి పియూష్ గోయల్ పదవీ బాధ్యతలు చేపట్టాక చోటు చేసుకున్న తొలి ప్రమాదం ఇదే. ఉదయం 6.25 సమయంలో ఘటన చోటు చేసుకుంది. ఉండాల్సిన స్థానంలో ఫిష్ ప్లేటు లేకపోవడం, అసలు ఏకంగా పట్టానే కొంత ముక్క విరిగిపోయినట్లుగా పక్కకు ఉండటాన్ని బట్టి చూస్తుంటే ఇది విద్రోహ చర్య కావచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. అయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఏకంగా ఏడు బోగీలు పట్టాలు తప్పి పక్కకు పడిపోయినా.. ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడం అదృష్టం. ఎందుకంటే, ఉత్తరప్రదేశ్ లోనే ఇంతకుముందు జరిగిన రెండు ప్రమాదాలలోను మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఉత్కళ్ ఎక్స్ ప్రెస్ లోని 14 బోగీలు పట్టాలు తప్పడంతో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. 97 మంది గాయపడ్డారు. అలాగే కైఫియత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన మార్గం చాలా ముఖ్యమైనది.
 
ఇటీవల రైళ్ల ట్రాఫిక్ పెరగటంతోపాటుగా ట్రాక్ విస్తరణ చేపట్టారు ఇందుకోసం పాటా, అచ్చాల్దా స్టేషన్ల మధ్య పట్టాలకు ఆనుకునే పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ముందురోజు రాత్రి ఇసుక లోడ్తో వచ్చిన ఓ ట్రక్కు ట్రాక్ వద్దకు రాగానే ఓ పక్కకు ఒరిగింది. బరువు ఎక్కువగా ఉండటంతో ట్రక్కు పట్టాలపై పడిపోయింది. ఈ విషయంపై సమాచారం లేకపోవటంతో కైఫియత్ ఎక్స్ప్రెస్ వేగంగా వచ్చింది. ప్రమాదాన్ని ముందే ఊహించిన డ్రైవర్ ఎస్కే చౌహాన్ ఎమర్జెన్సీ బ్రేకుతో రైలు ఆపేందుకు ప్రయత్నించారు. రైలు వేగం కొంతమేర తగ్గినా.. అప్పటికే ట్రక్కు సమీపంలోకి వచ్చేయటంతో ప్రమాదం జరిగింది. రైలు వేగంగా ట్రక్కును ఢీకొట్టడంతో ఇంజన్ సహా బి2, హెచ్1, ఎ1, ఎ2, ఎస్ 10 బోగీలు పట్టాలు తప్పాయి. ఇందులో ఒక బోగీ బోల్తాపడింది. ట్ప్రా ట్రక్కు పడిన విషయం తనకు ముందే తెలిసుంటే.. ఈ ప్రమాదం జరిగేది కాదని గాయాలతో బయటపడ్డ డ్రైవర్ చౌహాన్ తెలిపారు. కైఫియత్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం కచ్చితంగా తెలుస్తోంది. ఎందుకంటే, ముందుగా అక్కడ పనులు జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా ట్రాక్ మీద ఎర్రజెండాలు పెట్టాలి. ఆ మార్గంలో వెళ్లే రైళ్ల డ్రైవర్లకు దాని గురించి సమాచారం అందించాలి. అప్పుడే వాళ్లు అప్రమత్తంగా ఉండి ప్రమాదాలను తప్పించుకోగలుగుతారు. కైఫియత్ ఎక్స్‌ప్రెస్ విషయంలో డ్రైవర్ చౌహాన్ అప్రమత్తత వల్ల ప్రాణనష్టం సంభవించకుండా.. కేవలం గాయాలతోనే ప్రయాణికులు బయటపడగలిగారు. లేకపోతే మరింత పెద్ద నష్టం జరిగి ఉండేది. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 586 రైలు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 53 శాతం ప్రమాదాలు రైళ్లు పట్టాలు తప్పడంతోనే సంభవించాయి. 2014, నవంబర్ నుంచి మొన్నటి వరకు 20 రైలు ప్రమాదాలు జరిగినట్లు అధికారులు చెప్పారు. ఇందులో చాలా మైనర్ ప్రమాదాలు న్నాయని తెలిపారు.

నవంబర్ 20, 2016న ఇండోర్ - పట్నా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో 150 మంది ప్రాణాలు కోల్పోగా.. 150 మంది గాయపడ్డారు. మార్చి 20, 2015న డెహ్రాడూన్ - వారణాసి ఎక్స్ ప్రెస్ రాయ్ బరెలీలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 58 మంది ప్రయాణికులు మృతి చెందగా.. 150 మందికి పైగా గాయపడ్డారు. ఫిబ్రవరి 13, 2015న బెంగళూరు - ఎర్నాకులం ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది గాయపడ్డారు. 

గత ఐదేళ్లలో మన దేశంలో సంభవించిన ప్రమాదాల్లో 1220 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. కాపలా లేని రైల్వే లెవల్ క్రాసింగ్ల వద్ద చోటు చేసుకున్న ప్రమాదాల్లో 717 మంది మరణించారు. ఇదంతా సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నలకు రైల్వేశాఖ స్వయంగా ఇచ్చిన సమాచారమే. 2006-07 సంవత్సరంలో కాపలా లేని రైల్వే లెవల్ క్రాసింగ్ల వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో 146 మంది, 2007-08లో 148 మంది, 2008-09లో 129 మంది, 2009-10లో 170 మంది, 2010-11లో 124 మంది చనిపోయారు. అలాగే రైలు ప్రమాదాల్లో 2010-11లో 374 మంది, 2006-07లో 208 మంది, 2007-08లో 191 మంది, 2008-09లో 209 మంది, 2009-10లో 238 మంది మృతి చెందారు. రైల్వే బోర్డు ఇచ్చినఅధికార సమాచార లెక్కల ప్రకారం 2010-11లో గరిష్ఠంగా 239 మంది ప్రాణాలు కోల్పోయారు. 

రైళ్ల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చాలాసందర్భాలలో చెప్పింది. యాంటీ కొలిజన్ డివైజ్‌ల ద్వారా రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొనే ప్రమాదాలను నివారిస్తున్నట్లు తెలిపింది. నిజమే.. ఈ తరహా ప్రమాదాలు చాలావరకు తగ్గాయి. అందులో వారి చిత్తశుద్ధిని శకించలేం. కానీ అదే సమయంలో కాపలా లేని రైల్వే లెవెల్ క్రాసింగులను కూడా పట్టించుకోవాలి. అలాగే పట్టాల నిర్వహణ విషయంపైనా దృష్టిపెట్టాలి. విద్రోహ చర్యల వల్లనో.. లేదా మరేదైనా ఇతర కారణాల వల్లనో రైలు పట్టాలు విరిగిపోవడం, ఫిష్ ప్లేట్లు లేకపోవడం, లేదా కైఫియత్ ఎక్స్‌ప్రెస్ విషయంలో జరిగినట్లు పట్టాల మీద ఇసుక బస్తాల లాంటివి పడటం.. ఇవన్నీ నివారించదగినవే. సరైన పర్యవేక్షణ ఉంటే వీటిలో చాలావరకు అరికట్టవచ్చు. అయితే అందుకు ముందునుంచి సరైన వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలి, నిర్వహణ బాధ్యతలను సమర్థులకు అప్పగించాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.42 లక్షల రైలు భద్రతా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రైల్వేలలో అత్యంత ముఖ్యమైన ఈ విభాగంలోనే ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 24 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వేలో 10 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 6,398 ఇంజినీరింగ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా  4,827 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. 67 సెక్యూరిటీ పోస్టులు, 93 సిగ్నల్ మరియు టెలికాం, 613 పోస్టులు ఎలక్ట్రికల్ విభాగంలో ఖాళీలున్నట్లు రైల్వే బోర్డు ఓ ఆర్టీఐ సమాధానంలో తెలిపింది. సరిపడ ఉద్యోగులు లేకపోవడంతో ఒక్కో ఉద్యోగి 20 నుంచి 24 గంటలు పని చేయాల్సి వస్తోంది. దీంతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. సాధారణంగా ఇలాంటి సమయంలోనే ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువవుతుంది. అందువల్ల ఉద్యోగ నియామకాల ప్రక్రియను వెంటనే చేపట్టాలి. ఇటీవలి కాలంలో ప్రభుత్వోద్యోగాలంటే యువత బాగా మక్కువ చూపిస్తున్నారు. అందులోనూ ఇంజనీరింగ్ చదివి ఖాళీగా ఉంటున్నవాళ్లు చాలామందే ఉన్నారు. 


ఆటోమేషన్ పుణ్యమాని 2022 నాటికి మరిన్ని ఉద్యోగాలు ఖాళీ అవుతాయని చెబుతున్న నేపథ్యంలో.. ఉభయతారకంలా ఉంటుంది కాబట్టి రైల్వేలాంటి అత్యంత ముఖ్యమైన శాఖకు గుండెకాయ లాంటి భద్రతా విభాగాన్ని పటిష్ఠం చేయాలి. అలాగే సిగ్నలింగ్ వ్యవస్థను వీలైనంత ఆధునికీకరించాలి. పట్టాల నిర్వహణకు ఇన్నాళ్లుగా అవలంబిస్తున్న పాత విధానాలకు స్వస్తి పలికి, ఆధునిక విధానాలను చేపట్టాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఎక్కడ ఏ మార్గంలో పట్టాలలో సమస్య వచ్చినా ఎవరో ఒకరు కళ్లతో చూసి చెబితే తప్ప తెలియనవి విధానం నుంచి.. క్షణాల మీద సమాచారం కంట్రోల్ రూంకు అందేలా వ్యవస్థను సిద్దం చేసుకోవాలి. అప్పుడే రైలు ప్రమాదాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది.

విద్రోహ చర్య అయినా, లేదా సాంకేతిక సమస్య అయినా అక్కడ పట్టాలలో సమస్య వచ్చిన విషయం ముందుగానే తెలిస్తే, ఆ మార్గంలో వెళ్లే రైలును ముందుగానే ఆపొచ్చు, అక్కడ పట్టాలకు యుద్ధ ప్రాతిపదిక మీద మరమ్మతులు నిర్వహించి, ఆ తర్వాతే రైళ్లను పంపించవచ్చు. దానివల్ల తాత్కాలికంగా కొంతసేపు ప్రయాణికులు ఇబ్బంది పడితే పడతారు గానీ, వారి ప్రాణాలకు మాత్రం ఎలాంటి ప్రమాదం ఉండదు. ప్రమాదాలు సంభవించినపుడు మంత్రులను మార్చడం, అధికారుల మీద వేటు వేయడం ఒక్కటే పరిష్కారం కాదు. అలాంటి సమయాల్లో వారి నైతిక స్థైర్యాన్ని పెంచే చర్యలు తీసుకోవాలి. జరిగిన దానికి ఏ ఒక్కరో కాదు.. మొత్తం వ్యవస్థ బాధ్యత వహించాలి. అలాగని వ్యవస్థలో ఉన్న ఉద్యోగులందరినీ రాజీనామా చేయమని కాదు. ఏదైనా ఒకసారి జరిగితే పొరపాటు. రెండోసారి జరిగితే తప్పు. మూడోసారి కూడా జరిగితే అపరాధం. ఇలా చేసిన తప్పులు మళ్లీ మళ్లీ చేయకుండా ...వాటిని నివారించడానికి ఏం చేయాలన్న విషయమై సమగ్రమైన చర్చ జరగాలి. అప్పుడే ఈ తరహా ప్రమాదాలకు చెక్ పడుతుంది.  

చంద్ర‌శేఖ‌ర శ‌ర్మ‌

Similar News