టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం : ఛార్జి షీట్లో ఇద్దరు హీరోలు, ఒక డైరక్టర్
రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డ్రగ్స్ వాడకం సరఫరా కేసులో మొత్తం నాలుగు చార్జిషీట్లను అధికారులు దాఖలు చేశారు. ఇందులో టాలీవుడ్‌కు చెందిన ఓ దర్శకుడు ఇద్దరు హీరోల పేర్లు చేర్చారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌కు ముగ్గురు శాంపిల్స్ పంపగా ఇందులో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరికి సంబంధించిన ల్యాబ్ నివేదిక కోర్టుకు కూడా చేరింది.
టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.హైదరాబాద్ లో డ్రగ్స్ రాకెట్ పాపాల పుట్టను బద్దలు కొట్టేందుకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏర్పాటుచేసిన ప్రత్యేక అధికారుల బృందం (సిట్) నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో సినీ రంగం, రాజకీయనేతలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే అనుమానంతో బోయిన్‌పల్లికి చెందిన కెల్విన్ వాడిన మొబైల్ ఫోన్‌లో ఉపయోగించిన కోడ్ భాషలను డీకోడ్ చేశారు. ఈ డీకోడ్ ఆధారంగా కెల్విన్ ను అదుపులోకి తీసుకున్న ఎైక్సెజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ నేపథ్యంలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా కెల్విన్ నుంచి మూడు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులకు వాటిలో 2,500కు పైగా కాంటాక్టులు లభించాయి. వాటిలో 100కు పైగా మొబైల్ నెంబర్లు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులవేనని పోలీసులు గుర్తించారు.
ఈ మొబైల్ నెంబర్ల ఆధారంగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ , హీరోయిన్ ఛార్మీ, మొమైత్ ఖాన్ ,సుబ్బరాజు, కెమెరామ్యాన్ శ్యాం కే నాయుడు , హీరో రవితేజ,ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, నవదీప్ , తరుణ్ , తనీష్ , నందులకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీచేసారు. వీరిని సిట్ విచారణకు రావాలని ఆదేశించారు. అయితే నోటీసులతో విచారణకు హాజరైన టాలీవుడ్ ప్రముఖులు కెల్విన్ తో తమకు సంబంధంలేదని తెలిపారు.ఈ నేపథ్యంలో డ్రగ్స్ సరఫరా కేసులో కీలక నిందితుడు కెల్విన్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేసు విచారణ చేపట్టిన సిట్ అధికారులు కేసును లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సిట్ కు అనుమానం వచ్చిన ఇండస్ట్రీకి చెందిన వారిపై ఛార్జిషీట్ దాఖలు చేస్తుంది.