అధికార పార్టీ TRSలో ఇప్పుడిప్పుడే ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎమ్మెల్యేలు, నేతలంతా క్షేత్రస్థాయిలో పని చేసుకోవాలని గులాబీ బాస్ KCR సూచించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ ఎన్నికల సన్నాహ సమావేశాలు, ప్రగతి సభలతో క్యాడర్‌లో జోష్ నింపాలని భావిస్తున్నారు గులాబీ నేతలు. రాష్ట్రంలో మెల్లమెల్లగా ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రతిపక్షాలన్నీ ఏదో ఒక యాత్ర పేరుతో జనం బాట పట్టాయి. ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. నాలుగేళ్ళ పాలనపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నాయి. దీంతో అధికార పార్టీ కూడా అలర్టయింది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండటంతో ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలోనే ఉండాలని సీఎం KCR ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేలంతా నియోజకవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని గులాబీ బాస్ ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో నేతలంతా రానున్న నాలుగు నెలల్లో అన్ని నియోజక వర్గాల్లో మీటింగ్‌లకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పట్టణ ప్రాంత స్థానాల్లో మంత్రి KTR.. గ్రామీణ ప్రాంత నియోజక వర్గాల్లో మంత్రి హరీష్ రావు అటెండ్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఎక్కడ అవకాశమొచ్చినా ప్రభుత్వ స్కీంల ప్రచారం ప్రారంభించారు గులాబీ నేతలు. నియోజకవర్గ స్థాయి సమావేశాలను ఎన్నికల మీటింగ్‌లు గానే భావించాలని గులాబీ దళపతి సూచించినట్లు సమాచారం. ఒక్కొక్క సమావేశానికి కనీసం 25 నుంచి 30 వేల మంది హాజరయ్యేలా చూడాలని.. ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జనాలకు వివరించాలని భావిస్తున్నారు. ఎన్నికల హామీలన్నీ అమలు చేసిన సర్కారుగా చెప్పుకొనేందుకు ఈ సభలను వేదికగా చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.