తెలంగాణలో ప్రజకూటమికి మద్దతుగా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. నిన్న(శనివారం) ఆయన రాజేంద్రనగర్, కూకట్ పల్లిలో టీడీపీ అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణలో తనకు పనేంటని అడుగుతున్న కేటీఆర్, కేసీఆర్‌లకు హైదరాబాద్ ప్రజలే సమాధానం చెబుతారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో తాను పెత్తనం చేయాలని ప్రచారానికి రాలేదని, ఒక బాధ్యతతో వచ్చానన్నారు. కేంద్రంలో సీనియర్ మోడీ, రాష్ట్రంలో జూనియర్ మోడీ ఎదురుదాడి చేస్తూ భయంభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. తాను నాలుగు బిల్డింగ్‌లు కట్టించానంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. నమ్మించి మోసం చేసిన మోడీ, కేసీఆర్‌లకు ఓటుతో బుద్ధి చెప్పాలంటూ కూకట్‌పల్లి ఓటర్లను చంద్రబాబు కోరారు. కాగా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్, పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.