పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకునేటపుడు దానివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని భావించారు. నల్లధనం మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. రద్దయిన నోట్లలో 99 శాతం మళ్లీ బ్యాంకులలోకి వచ్చేశాయని స్వయంగా రిజర్వు బ్యాంకే ప్రకటించింది. అంటే, నల్లధనం మొత్తం తెల్లటి రంగేసుకుని మళ్లీ ఎంచక్కా కోటీశ్వరుల జేబుల్లోకి చేరిపోయినట్లే లెక్క. దొంగనోట్లు పూర్తిగా పోతాయనకున్నారు. కానీ కొత్తగా ముద్రించిన రెండు వేల రూపాయల నోట్లకు కూడా దొంగనోట్లు చకచకా మార్కెట్లలోకి వచ్చేశాయి, వాటిని కొన్నిచోట్ల పట్టుకున్నారు కూడా.
చాలా కాలం తర్వాత మళ్లీ భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తోంది. అమెరికా లాంటి అగ్ర రాజ్యాలు 2-3 శాతానికి మించి జీడీపీ వృద్ధిరేటును సాధించలేని పరిస్థితులలో కూడా మన దేశం 7 శాతానికి పైగా రేటుతో దూసుకెళ్లిపోతోంది అనుకుం టున్న తరుణంలో వరుసగా మూడు త్రైమాసికాల నుంచి మందగమనం నమోదవుతోంది. అందులోనూ జూన్ నెలతో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కేవలం 5.7 శాతం వృద్ధిరేటు నమోదు కావడంతో ఇది గడిచిన మూడేళ్లలో అత్యల్ప స్థాయి అయ్యింది. 2014 జనవరి-మార్చి (ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికం) తర్వాత అత్యంత తక్కువ స్థాయి ఇదేనని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సవరించిన రేటు 7.9 శాతం ఉంది. అదే సంవత్సరం నాలుగో త్రైమాసికం వచ్చేసరికి అది 6.1 శాతానికి పడిపోయింది. తొమ్మిది నెలల క్రితం.. అంటే 2016 నవంబర్ 8వ తేదీ రాత్రి సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ఆర్థిక వ్యవస్థను తలకిందులు చేసేలా సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. అప్పటివరకు చలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది తీసుకొచ్చిన కుదుపు మామూలుగా లేదు.
నిజానికి 50 రోజుల్లోనే అంతా సర్దుకుపోతుందని ప్రధాని మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు, పెద్దనోట్ల రద్దును సమర్థించిన ఆర్థిక శాస్త్రవేత్తలు అంతా భావించారు. అందుకే అప్పట్లో నాకు 50 రోజులు టైం ఇవ్వండి దేశంలో నల్లధనం లేకుండా చేస్తా అలా చేయలేకపోతే నడిరోడ్డుపై ఉరి తీయండి అని అంత ధైర్యంగా మోదీ చెప్పారు. 50 రోజుల మాట అటుంచితే, ఇప్పటికి 270 రోజులు దాటిపోయినా ఇంకా పెద్దనోట్ల రద్దు మిగిల్చిన మందగమనం ప్రభావం నీలినీడలు ఇంకా వీడిపోమంటున్నాయి. ఇప్పుడు వృద్ధిరేటు మూడేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోవడానికి కూడా ప్రధాన కారణం పెద్దనోట్ల రద్దు ప్రభావమేనని తేల్చి చెబుతున్నారు. ఒక సదుద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నా, దేశ స్థూల జాతీయోత్పత్తిలో ప్రధాన భాగమైన ఉత్పాదక రంగం మీద దాని ప్రభావం ఎలా ఉండబోతుందన్న అంచనాను ఆర్థికవేత్తలు ముందుగా వేయలేకపోవడం వల్లే ఇన్ని విపరిణామాలు జరిగాయన్నది అంగీకరించక తప్పని వాస్తవం.
ఒకవైపు మేకిన్ ఇండియా అంటూ ఉత్పాదక రంగాన్ని పరుగులు పెట్టించడానికి విదేశీ సంస్థలను కూడా రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించిన ప్రధానమంత్రి మోదీ.. మరోవైపు అదే సమయంలో నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించడం ద్వారా ఉత్పాదక రంగానికి అత్యవసరమైన నగదు అందుబాటులో లేకుండా చేశారు. చాలావరకు చిన్న పరిశ్రమలు, ఫ్యాక్టరీలలో కార్మికులకు రోజువారీ లేదా నెలవారీ వేతనాలు నగదు రూపంలోనే చెల్లిస్తారు. అలాంటి అవసరాల కోసం నగదు అందుబాటులో లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉత్పాదక రంగం ఒక్కసారిగా పడిపోయింది. గత ఏడాది మొదటి త్రైమాసికంలో 10.7 శాతం వృద్ధిరేటును నమోదు చేసిన ఈ రంగం.. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కేవలం 1.2 శాతం వృద్ధిరేటుకే పరిమితం అయింది. జీడీపీ అంటే ఉత్పాదక, వ్యవసాయ, సేవా రంగాలు.. ఇలా అన్ని రంగాల్లో సాధించిన వృద్ధిరేటు అంతా కలిపి ఉంటుంది.
వ్యవసాయ రంగంలో పెద్దగా మనం సాధించే వృద్ధి ఏమీ ఇటీవలి కాలంలో ఉండటం లేదు. సాగు పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగానే ఉంది. ఇక మిగిలినవి ప్రధానంగా ఉత్పాదక, సేవా రంగాలు మాత్రమే. వీటిలో అత్యంత ప్రధానమైన ఉత్పాదక రంగం క్షీణతను నమోదుచేయడంతో ఆ ప్రభావం జీడీపీ మీద గట్టిగానే పడింది. ఆ రంగంతో పాటు.. ఆర్థిక సర్వీసులు, బీమా, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసుల రంగాలు కూడా దిగజారాయి. ఈ రంగాల వృద్ధి రేటు 9.4 శాతం నుంచి 6.4 శాతానికి క్షీణించింది. వ్యవసాయ రంగంలోనూ కొద్దిపాటి క్షీణతే కనిపించింది. గత ఏడాదితో పోల్చితే ఈ రంగం వృద్ధిరేటు 2.5 శాతం నుంచి 2.3 శాతానికి దిగజారింది. మౌలిక సదుపాయాల రంగం వృద్ధి రేటు కూడా గత ఏడాది ఇదే కాలంలో 3.1 శాతం ఉండగా.. ఈసారి 2.4 శాతానికే పరిమితమైంది.
పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకునేటపుడు దానివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని భావించారు. నల్లధనం మొత్తం తుడిచిపెట్టుకు పోతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. రద్దయిన నోట్లలో 99 శాతం మళ్లీ బ్యాంకులలోకి వచ్చేశాయని స్వయంగా రిజర్వు బ్యాంకే ప్రకటించింది. అంటే, నల్లధనం మొత్తం తెల్లటి రంగేసుకుని మళ్లీ ఎంచక్కా కోటీశ్వరుల జేబుల్లోకి చేరిపోయినట్లే లెక్క. దొంగనోట్లు పూర్తిగా పోతాయనకున్నారు. కానీ కొత్తగా ముద్రించిన రెండు వేల రూపాయల నోట్లకు కూడా దొంగనోట్లు చకచకా మార్కెట్లలోకి వచ్చేశాయి, వాటిని కొన్నిచోట్ల పట్టుకున్నారు కూడా. అంటే అధికారుల దృష్టికి రాకుండా ఇంకా ఎంతమొత్తంలో దొంగనోట్లు మార్కెట్లలో చలామణి అవుతున్నాయో తెలియదనే కదా. దాంతో ఆ ప్రయోజనం కూడా నెరవేరలేదు. డీమానిటైజేషన్ తర్వాత పన్ను చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని కూడా అంచనా వేశారు. కొత్త పన్ను చెల్లింపుదారుల సంఖ్య 25 శాతం పెరిగిన మాట వాస్తవమే అయినా.. ఇది కేవలం పెద్దనోట్ల రద్దు వల్ల మాత్రమేనని చెప్పలేం.
ఎందుకంటే, ఆర్థిక రంగంలో తీసుకుంటున్న నిర్ణయాలతో పాటు.. పెరుగుతున్న ఆదాయ స్థాయిల వల్ల ప్రతియేటా కొత్తగా పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చేవారి సంఖ్య వృద్ధి చెందుతూనే ఉంది. పెద్ద నోట్ల రద్దుతో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరుగుతాయని అంచనా వేసినా, వాస్తవంలో అలా లేదు. డిజిటల్ చెల్లింపుల్లో పెద్దగా మార్పులు రాలేదని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఏప్రిల్లో ప్రకటించింది. స్త్వ్రపింగ్ మిషన్లను ఏర్పాటుచేసుకోడానికి వ్యాపారులు విముఖత చూపించడం, ప్రైవేటు రంగ బ్యాంకులు కార్డు స్త్వ్రపింగులపై సర్వీసు చార్జీలు మోతెక్కించడం వల్ల డిజిటల్ చెల్లింపులకు ప్రజలు దూరమయ్యారు. అవినీతి అంతమైపోతుందని, పెద్దనోట్లలో లంచం ఇవ్వాల్సి ఉన్నందున ఇకమీదట అది సాధ్యం కాదని అనుకున్నారు. అలా జరగకపోగా అవినీతి రోజురోజుకూ మరింత వ్యవస్థీకృతం అవుతూనే ఉంది. పైపెచ్చు, పాత నోట్ల మార్పిడి పేరుతో బ్యాంకింగ్ రంగానికి కూడా ఈ అవినీతి భూతం విస్తరించింది.
ఇలా మొత్తమ్మీద చూసుకుంటే... పెద్దనోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో ఊహించని మార్పులేమీ సంభవించలేదు, ఊహించినంత మేలు కూడా జరగలేదు. పైపెచ్చు అనుకున్న దాని కంటే చాలా ఎక్కువ స్థాయిలో నష్టం జరిగింది. ప్రధానంగా పలు రంగాలలో వృద్ధిరేటు బాగా పడిపోవడం వల్ల జీడీపీ కూడా నష్టపోవాల్సి వచ్చింది. అంతేకాదు.. ఈ విషయంలో వరుసగా రెండోసారి కూడా మనం చైనా కంటే వెనకబడ్డాం. చైనా వరుసగా రెండు త్రైమాసికాలుగా 6.9 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది.ఈ రెండు సార్లూ మనం దాని కంటే కిందనే ఉన్నాం. ఒకవైపు అంతర్జాతీయ వాణిజ్యం సహా అన్ని రంగాల్లోనూ చైనాను దాటిపోవాలని.. ప్రపంచ ఆర్థిక శక్తులలో ఒకటిగా నిలవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నా మరోవైపు ఫలితాలు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి.
వాస్తవానికి పెద్ద నోట్ల రద్దు వల్ల వస్తున్న ప్రతికూల ప్రభావం జనవరి-మార్చి త్రైమాసికంతోనే ముగిసిపోతుందని, ఏప్రిల్-జూన్ త్రైమాసికం నుంచి వృద్ధి రేటు తిరిగి పుంజుకుంటుందని చాలామంది ఆర్థికవేత్తలు భావించారు. ఈసారి వృద్ధిరేటు 6.6 శాతానికి పైగానే ఉంటుందని కూడా అంచనా వేశారు. కానీ, జీఎస్టీ అమలవుతోందన్న భయంతో.. ఏం జరుగుతుందోనన్న అప్రమత్త వాతావరణం కూడా తోడు కావడం జీడీపీ వృద్ధిరేటును గట్టిగా దెబ్బతీసింది. జీఎస్టీ వల్ల ధరలపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనన్న భయంతో చాలామంది ప్రీ జీఎస్టీ సేల్ అంటూ అమ్మకాలు మోతెక్కించారు. దీని ప్రతికూల ప్రభావం వ్యాపార సెంటిమెంటును దెబ్బతీసింది. గత ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 9.1 శాతం వృద్ధి రేటు నమోదైన తర్వాత.. వరుసగా అన్ని త్రైమాసికాల్లోనూ వృద్ధిరేటు క్షీణిస్తూనే వచ్చింది.
అయితే.. ఈ మందగమనం ఎన్నాళ్లో ఉండకపోవచ్చని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దగ్గర నుంచి చాలామంది ఆర్థికవేత్తలు కూడా అంచనా వేస్తున్నారు. ప్రధానంగా జీఎస్టీ మీదే వాళ్లు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. జీఎస్టీ చెల్లింపులు అనుకున్నదాని కంటే చాలా ఎక్కువగా ఉండటం, అంచనాలను మించి రెవెన్యూ వసూళ్లు కనిపించడం వారి ఆశలకు ప్రధాన కారణం. ఇప్పటికే 92 వేల కోట్ల మేర జీఎస్టీ వసూలైందని, ఇంకా మరో మూడోవంతు మంది వ్యాపారులు జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉన్నందున ఇది మరింత పెరుగుతుందని చెబుతున్నారు. పన్నుల రూపంలో వచ్చే ఆదాయం ఒక్కసారిగా పెరగడం అన్ని రంగాలకు శుభసూచకమేనని అంటున్నారు. దీని ప్రభావం రాబోయే ఒకటి రెండు త్రైమాసికాల్లోనే స్పష్టంగా కనిపిస్తుందని, జీడీపీ వృద్ధి చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నిజంగా అలాగే జరిగి జీడీపీ వృద్ధిరేటులో దేశం దూసుకుపోతే సంతోషించేవాళ్లు మనకంటే ఎవరూ ఉండరు. కానీ ఉత్పాదక రంగం వృద్ధి మళ్లీ పుంజుకోడానికి కూడా తగిన మార్గాలు అన్వేషించాల్సిన తక్షణావసరం మోదీ సర్కారు ముందు కనిపిస్తోంది. ఆ రంగం అభివృద్ది చెందితే చాలామంది బాగుపడతారు. దినసరి వేతన కార్మికుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరి ముఖాల్లో సంతోషం కనపడుతుంది. అప్పుడే దేశం కూడా ముందుకెళ్తుంది. అందువల్ల ఆ రంగం ఎదుగుదలకు ప్రధానంగా ఎలాంటి ఆటంకాలు ఉన్నాయో గుర్తించి, వాటిని తొలగిస్తేనే మొత్తం వృద్దిరేటు కూడా బాగుంటుంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.