ఏటీఎంలో డబ్బులు ఉండటం లేదా? కారణం ఏంటో తెలుసా?
Why no cash in ATMs: ఏటీఎంలు మెయింటెనెన్స్‌లో లేకుండా చెత్తచెత్తగా కనిపిస్తున్నాయా? దానికి కారణం ఏంటో తెలుసా?

ఏటీఎంలో డబ్బులు ఉండటం లేదా? కారణం ఏంటో తెలుసా?
No cash in ATMs: డబ్బులు డ్రా చేయడం కోసం ఏటీఎంకు వెళ్తే అక్కడ నో క్యాష్ బోర్డ్ కనిపిస్తోందా? లేదంటే ఏటీఎంలు మెయింటెనెన్స్‌లో లేకుండా చెత్తచెత్తగా కనిపిస్తున్నాయా? దానికి కారణం ఏంటో తెలుసా? అయితే, ఇది మీకొక్కరికే ఎదురవుతున్న పరిస్థితి కాదు. లేదంటే కేవలం మీ ఏరియాకే ఇలాంటి సమస్య పరిమితమై లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఏటీఎంలో ఇప్పుడు ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఏటీఎంలను మెయింటెన్ చేసే సర్వీస్ ప్రొవైడర్ సంస్థల్లో ఒకటైన ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ అనే సంస్థ దివాలా తీయడమే అందుకు కారణం. దేశంలో అనేక పెద్ద పెద్ద బ్యాంకులకు ఈ సంస్థే ఏటీఎం సేవలు అందిస్తోంది. అందుకే దేశంలో వేల సంఖ్యలో ఏటీఎం సేవలు నిలిచిపోయాయి.
అసలేం జరిగిందంటే..
ఫిబ్రవరిలో ఐసిఐసిఐ బ్యాంకుకు చెందిన అనేక ఏటీఎంలలో క్యాష్ లేకుండాపోయింది. ఏటీఎంలలో క్యాష్ లోడ్ చేసేందుకు ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ సంస్థ సిబ్బంది నిరాకరించారు. నెలల తరబడిగా తమ సంస్థ జీతాలు చెల్లించడం లేదని వారు వాపోయారు. పెండింగ్ శాలరీస్ చెల్లించే వరకు పనిచేసేది లేదని చెప్పి నిరసన వ్యక్తంచేశారు.
సంస్థ దివాళ తీసినట్లుగా అప్పట్లో కంపెనీ ప్రకటించింది. రవి గోయల్ ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ సంస్థకు ప్రమోటర్ గా ఉన్నారు. గత వారం కంపెనీ నుండి మరో ప్రకటన వచ్చింది. కంపెనీతో పాటు కంపెనీ అనుబంధ సంస్థలు రూ. 38.59 కోట్లు చెల్లించడంలో డీఫాల్ట్ అయినట్లుగా స్పష్టంచేసింది. అంతేకాదు... ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ సంస్థతో పాటు తమ అనుబంధ సంస్థ సెక్యూర్ వ్యాల్యూ ఇండియా రూ. 719 కోట్లు అప్పులు చెల్లించాల్సి ఉందని చెప్పింది. ఆ రెండు సంస్థలకు అంత పెద్ద మొత్తంలో అప్పులు ఇచ్చిన వారిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సెస్ బ్యాంక్ వంటి సంస్థలు ఉన్నాయి.
అప్పుల్లో కూరుకుపోయిన ఈ సంస్థకు క్రెడిట్ రేటింగ్ సంస్థలు తక్కువ రేటింగ్ ఇవ్వడంతో కొత్తగా ఎక్కడా అప్పు పుట్టే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీనికితోడు కంపెనీలో ఉన్న నలుగురు ఇండిపెండెంట్ డైరెక్టర్స్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసి పక్కకు తప్పుకున్నారు. దీంతో సంస్థను ముందుండి నడిపించి ఈ కష్టాల్లోంచి గట్టెక్కించే వారు కరువయ్యారు. ఫలితంగా కంపెనీ సేవలు నిలిచిపోయాయి. ఈ కారణంగానే కేవలం ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంకులకు చెందిన 38 వేల ఏటీఎంలలో సేవలు నిలిచిపోయాయి.
యాక్సెస్ బ్యాంకుకు చెందిన 5 వేల ఏటీఎంలను ఈ కంపెనీయే మెయింటేన్ చేస్తోంది. ఇండియా పోస్టుకు చెందిన 1000 ఏటీఎంలు, యస్ బ్యాంకుకు చెందిన 500 ఏటీఎంలు కూడా ఈ సంస్థే నిర్వహిస్తోంది. గత 2, 3 నెలలుగా ఈ ఏటీఎంలను పట్టించుకునే వారు లేకపోవడంతో అవి పనిచేయకుండాపోయాయి.
ముందే తేరుకున్న ఐసిఐసిఐ బ్యాంక్
ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎంలలో క్యాష్ ఉండటం లేదనే ఫిర్యాదులు ఎక్కువ అవడంతో ఆ బ్యాంక్ డిసెంబర్ నెలలోనే పరిస్థితిని గ్రహించింది. సమస్యను ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ప్రస్తుతం ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎం సర్వీస్ ప్రొవైడర్‌ను మార్చేసే పనిలో బిజీ అయింది.
Delimitation Explainer: డీలిమిటేషన్‌తో ఎవరికి ఎక్కువ లాభం? ఎవరికి ఎక్కువ నష్టం?
New Income Tax Bill: ఐటి అధికారుల చేతుల్లో మీ ఈమెయిల్స్, బ్యాంక్ ఎకౌంట్స్, సోషల్ మీడియా
Rs. 40 Lakh Per Annum Job offer: ఏడాదికి రూ. 40 లక్షల జీతం..