ఎలాన్ మస్క్ స్టార్ లింక్‌తో ఎయిర్‌టెల్ ఒప్పందం... భారత్‌లోకి మస్క్ ఎంట్రీ!

ఎలాన్ మస్క్ స్టార్‌లింక్‌తో ఎయిర్‌టెల్ ఒప్పందం... భారత్‌లోకి మస్క్ ఎంట్రీ!
Airtel agreement with Elon Musk: ఎలాన్ మస్క్ ఎప్పటి నుండో ఇండియాలో వ్యాపారం చేయాలని ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా టెస్లా కార్లతో పాటు స్పేస్ ఎక్స్ సంస్థ ద్వారా నడుస్తున్న స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ఇండియాకు తీసుకొచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ విదేశాలకు చెందిన లగ్జరీ కార్లపై భారత్ 100 శాతం సుంకం విధిస్తుండటంతో ఇప్పటివరకు ఇండియాలో టెస్లా కార్ల వ్యాపారం సాధ్యపడలేదు. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ వ్యాపారం కోసం పెట్టుకున్న దరఖాస్తు ఇంకా భారత ప్రభుత్వం వద్దే పరిశీలనలో ఉంది.
విదేశీ బ్రాడ్ బాండ్ సంస్థకు వ్యాపారానికి అనుమతిస్తే దేశానికి భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయేమోనని భారత్ అనుమానం వ్యక్తంచేస్తోంది. ఇండియాలోకి స్టార్‌లింక్ ఎంట్రీపై టెలికాం నెట్‌వర్క్ సంస్థలు కూడా ఆందోళన వ్యక్తంచేస్తూ అభ్యంతరం చెబుతూ వచ్చాయి. కానీ తాజాగా చోటుచేసుకున్న పరిణామాన్ని చూస్తే ఇక ఎలాన్ మస్క్ ఎంట్రీకి రూట్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది.
తాజాగా మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థతో ఎయిర్‌టెల్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది.స్పేస్ ఎక్స్ ద్వారా స్టార్‌లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను కూడా తమ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఎయిర్‌టెల్ ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇండియాకు చెందిన సంస్థతో ఎలాన్ మస్క్ ఇలా అగ్రిమెంట్ కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి.
ఇండియాలో అన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీలు ఎలాగైతే డిష్ లేదా రూటర్ లాంటి ఎక్విప్‌మెంట్స్ ద్వారా బ్రాడ్‌బాండ్ సేవలు అందిస్తున్నారో స్టార్ లింక్ కూడా అంతే. ఇకపై స్టార్‌లింక్ విక్రయించే ఆ బ్రాడ్‌బాండ్ ఎక్విప్‌మెంట్స్ ఎయిర్‌టెల్ స్టోర్స్‌లో లభించనున్నాయి. అలాగే ఎయిర్‌టెల్ ద్వారా స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు విక్రయించనున్నారు. ఎయిర్‌టెల్ సంస్థతో చేసుకున్న ఈ ఒప్పందంతో ఇక ఇండియాలోని అన్ని పెద్దపెద్ద వాణిజ్య సంస్థలకు కూడా స్టార్‌లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అదుబాటులోకి రానున్నాయి.
స్టార్‌లింక్‌తో ఒప్పందం విషయమై ఎయిర్ టెల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్ గోపాల్ విఠల్ స్పందించారు. ఇండియాలో మారుమూల ప్రాంతాలకు కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం అందించడమే లక్ష్యంగా ఎయిర్‌టెల్ ఈ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు విఠల్ తెలిపారు.