రూ. 14 కోట్లకు అమ్ముడైన లగ్జరీ ప్రాపర్టీ.. కొత్త రికార్డ్ సెట్ చేసిన భారీ డీల్

Update: 2024-10-04 15:02 GMT

Luxury Property Price: పెద్దపెద్ద మెట్రోపాలిటన్ నగరాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ ఏ రేంజులో ఉంటుంది, తమకు నచ్చిన లగ్జరీ ప్రాపర్టీని కొనడానికి బాగా డబ్బున్నోళ్లు ఎక్కడివరకైనా వెళ్లడానికి వెనుకాడరనడానికి ఈ ప్రాపర్టీ డీల్‌ని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అది ముంబైలోని బోరిబలి ప్రాంతం. ఇప్పుడిప్పుడే అంధేరి, విలే పార్లె, దాదర్, మహిం వంటి ఖరీదైన ప్రాంతాలకు సమానంగా ఎదుగుతున్న ఆ ప్రాంతంలో లగ్జరీ ప్రాపర్టీలకు భారీగా డిమాండ్ కనిపిస్తోంది. తాజాగా జరిగిన ఒక భారీ డీల్ ముంబైలోని స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులనే ఔరా అని ముక్కున వేలేసుకునేలా చేసింది.

సాధారణంగా బోరిబలిలో లగ్జరీ ప్రాపర్టీల ధరల విషయానికొస్తే.. ఒక చదరపు అడుగుకి రూ. 25 వేల నుండి మొదలుకుని రూ. 40 వేల వరకు పలుకుతోంది. సగటున రూ. 30 వేలకు చదరపు అడుగు చొప్పున అమ్ముడయ్యే ప్రాపర్టీలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ తాజాగా ఒక 4 బెడ్ రూమ్ ఫ్లాట్‌తో ఉన్న ఒక లగ్జరీ ఇల్లు ఏకంగా రూ. 56 వేలకు చదరపు అడుగు చొప్పున అమ్ముడుపోయింది. 2,497 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ లగ్జరీ ఫ్లాట్ ధర అక్షరాల రూ. 14 కోట్లు పలికింది. బోరిబలిలో ఇప్పటివరకు అమ్ముడైన ప్రాపర్టీలలో ఇదే అత్యధిక ధర అని అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు.

బోరిబలిలోని అక్వేరియా గ్రాండ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ వధ్వా గ్రూప్ ఈ లగ్జరీ ప్రాపర్టీని నిర్మించింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌కి చెందిన బిజినెస్‌మేన్ హేమంత్ పాటిల్ ఈ ఇంటిని కొనుగోలు చేశారు. ఈ ప్రాపర్టీ డీల్ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ని ఇండెక్స్.ట్యాప్ అనే రియల్ ఎస్టేట్ బిజినెస్ కన్సల్టెన్సీ ఎనలైజ్ చేసింది. బోరిబలి రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఈ ప్రాపర్టీ డీల్ ఓ సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిందని ఆ సంస్థ సీఈఓ అభిషేక్ కిరణ్ గుప్తా తెలిపారు.

ఇప్పటివరకు బోరిబలిలో అత్యధిక మొత్తంలో జరిగిన మొట్టమొదటి ప్రాపర్టీ డీల్ ఇదే అవుతుందని అభిషేక్ పేర్కొన్నారు. నచ్చిన లగ్జరీ ప్రాపర్టీని సొంతం చేసుకునేందుకు శ్రీమంతులు ఎంత పెద్ద మొత్తమైనా ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదని ఈ ప్రాపర్టీ డీల్ మరోసారి స్పష్టంచేసిందని అభిషేక్ చెబుతున్నారు. 

Tags:    

Similar News