EV Market: ఆరేళ్లలో ఈవీ పరిశ్రమ 20 లక్షల కోట్లు.. 5 కోట్ల ఉద్యోగ అవకాశాలు: నితిన్ గడ్కారీ
EV Market : 2030 నాటికి భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) మార్కెట్ పరిమాణం రూ. 20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) అన్నారు.
EV Market : 2030 నాటికి భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) మార్కెట్ పరిమాణం రూ. 20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) అన్నారు. ఇది మొత్తం ఈవీ ఎకో సిస్టమ్‌లో దాదాపు ఐదు కోట్ల ఉద్యోగాలకు అవకాశాలను కల్పిస్తుందన్నారు. ఇ-వాహన పరిశ్రమకు సంబంధించిన 8వ కాటలిస్ట్ కాన్ఫరెన్స్ ఈవీ ఎక్స్ పో 2024( the 8th Catalyst Conference - EV Expo-2024)ను ఉద్దేశించి గడ్కరీ మాట్లాడారు. 2030 నాటికి ఎలక్ట్రిక్ వెహికల్ ఫైనాన్సింగ్ మార్కెట్ పరిమాణం దాదాపు రూ. 4 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
5 కోట్ల ఉద్యోగావకాశాలు
2030 నాటికి భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల(Electric Vehicle) మార్కెట్ వాల్యూ రూ. 20 లక్షల కోట్లుగా ఉంటుందన్నారు. ఇది మొత్తం ఈవీ రంగంలో ఐదు కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని ఆయన అన్నారు. భారతదేశంలో 40 శాతం వాయు కాలుష్యానికి రవాణా రంగమే కారణమని నితిన్ గడ్కారీ తెలిపారు.
గ్రీన్ ఎనర్జీపై ప్రభుత్వం దృష్టి
22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటున్నామని, ఇది పెద్ద ఆర్థిక సవాలు అని గడ్కరీ అన్నారు. ఇలా శిలాజ ఇంధనాల దిగుమతి మన దేశంలో అనేక సమస్యలను సృష్టిస్తోంది. భారతదేశ విద్యుత్ వినియోగంలో 44 శాతం సోలార్ ఎనర్జీ పై ఆధారపడి ఉన్నందున ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారిస్తోంది. జలవిద్యుత్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆ తర్వాత సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, ముఖ్యంగా బయోమాస్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇప్పుడు సౌరశక్తి మనందరికీ ముఖ్యమైన వనరులలో ఒకటి అని మంత్రి తెలిపారు.
మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు అవసరం
దేశంలో ఎలక్ట్రిక్ బస్సుల సమస్యను కూడా గడ్కరీ గుర్తు చేశారు. మన దేశానికి లక్ష ఎలక్ట్రిక్ బస్సులు(Electric Buses) అవసరం అయితే ప్రస్తుతం 50 వేల బస్సులు మాత్రమే ఉన్నాయి. ఫ్యాక్టరీని విస్తరించేందుకు ఇదే సరైన సమయం అని సదరు కంపెనీలకు మంత్రి సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు నాణ్యత విషయంలో రాజీ పడవద్దని గడ్కరీ కోరారు.
ఇప్పుడు చైనా వంతు
2014లో తాను రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు మోటారు వాహనాల పరిశ్రమ పరిమాణం రూ.7 లక్షల కోట్లుగా ఉండేదన్నారు. నేడు అది (ఆటోమోటివ్ పరిశ్రమ పరిమాణం) రూ.22 లక్షల కోట్లు అని మంత్రి చెప్పారు. ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నాం. మేము ఇటీవల జపాన్‌ను దాటేశామన్నారు. ఈ జాబితాలో అమెరికా 78 లక్షల కోట్ల రూపాయలతో ఆటోమోటివ్ పరిశ్రమతో మొదటి స్థానంలో ఉండగా, 47 లక్షల కోట్ల రూపాయలతో చైనా రెండవ స్థానంలో ఉంది.