House prices: హైదరాబాద్‌తో సహా ఈ నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయి..!
House prices: ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి
House prices: ఇల్లు కొనాలనుకునేవారికి ఇది బ్యాడ్‌న్యూస్ అని చెప్పవచ్చు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. 42 నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయి. అదే సమయంలో 5 నగరాల్లో ఇళ్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. 3 నగరాల్లో ధరలు స్థిరంగా ఉన్నాయి. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB) హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ ఈ సమాచారం వెల్లడించింది. అయితే ఏ నగరాల్లో ఎంత పెరిగాయో తెలుసుకుందాం.
ఇళ్ల రేట్లు ఎంత పెరిగాయి?
నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అందుకున్న సమాచారం ప్రకారం.. 8 ప్రధాన మెట్రోలలో వార్షిక ప్రాతిపదికన ఇండెక్స్ పెరిగింది. ఇందులో అహ్మదాబాద్ (13.5 శాతం), బెంగళూరు (3.4 శాతం), చెన్నై (12.5 శాతం), ఢిల్లీ (7.5 శాతం), హైదరాబాద్ (11.5 శాతం), కోల్‌కతా (6.1 శాతం), ముంబై (2.9 శాతం), పుణె (3.6 శాతం) ఉన్నాయి. త్రైమాసిక ప్రాతిపదికన 50 నగరాల సూచిక 1.7 శాతం పెరిగింది. గత త్రైమాసికంలో ఇది 2.6 శాతం పెరిగిన సంగతి తెలిసిందే.
అయితే నవీ ముంబైలోని హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ (HPI)లో వార్షిక ప్రాతిపదికన పెద్ద వ్యత్యాసం ఉంది. కోయంబత్తూరులో 16.1 శాతం పెరిగింది. అదే సమయంలో నవీ ముంబైలో 5.1 శాతం క్షీణించింది. HPIలో 2017-18ని బేస్ ఇయర్‌గా తీసుకుంటారు. ఇది త్రైమాసిక ప్రాతిపదికన 50 నగరాల్లో ప్రాపర్టీ ధరల కదలికను ట్రాక్ చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ద్రవ్యోల్బణం కారణంగా మెట్రో నగరాల్లో ఇల్లు కొనడం చాలా కష్టంగా మారింది.