Dhanteras 2024: నేడు ధనత్రయోదశి..లక్ష్మీపూజ శుభసమయం..పూజా విధానం
Dhanteras 2024: నేడు ధనత్రయోదశి. ఈ రోజు ధన్వంతరి జయంతి కూడా. ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఏడాదంతా ఆస్తి, సంపద పెరుగుతుందని చాలా మంది నమ్మకం. లక్ష్మీపూజకు శుభసమయం, పూజా విధానం గురించి తెలుసుకుందాం.
Dhanteras 2024: నేడు ధన్తేరస్. నేడు ధన్తేరస్ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు బంగారం, వెండి ఆభరణాలు, వాహనాలు, పాత్రలు మొదలైనవి కొనుగోలు చేస్తుంటారు. ధన్తేరస్ కార్తీకమాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి తేదీన జరుపుకుంటారు. మంగళవారం సాయంత్రం అంటే ప్రదోష కాలంలో లక్ష్మీదేవి, ధనపతి కుబేరుడు, ధన్వంతరితో పాటుగా వినాయకుడిని పూజిస్తుంటారు. ధన త్రయోదశి రోజు పూజ చేయడం వల్ల ఏడాది పొడవునా అంతా మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. కుబేరుడి అనుగ్రహంతో సంపద పెరుగుతుందని నమ్మకం. ధన్తేరస్ రోజు త్రిపుష్కర యోగం ఏర్పడింది. ఈ రోజు చేసిన పూజలు, శుభకార్యాల ఫలితాలు మూడు రెట్లు పెరుగుతాయి. ధన్తేరస్ ధనత్రయోదశి అని కూడా అంటారు.
ధనత్రయోదశి 2024 ముహూర్తం ఇదే:
కార్తీక కృష్ణ త్రయోదశి తిథి ప్రారంభం: ఈరోజు మంగళవారం ఉదయం 10:31 నుండి ప్రారంభం అవుతుంది.
కార్తీక కృష్ణ త్రయోదశి తిథి ముగింపు: రేపు అనగా బుధవారం, మధ్యాహ్నం 1:15 గంటలకు
ధనత్రయోదశి పూజ ముహూర్తం: మంగళవారం సాయంత్రం 6:31 నుండి 8:13 వరకు.
ప్రదోషకాలం: మంగళవారం సాయంత్రం 05:38 నుండి రాత్రి 08:13 వరకు.
వృషభ రాశి: మంగళవారం సాయంత్రం 06:31 నుండి రాత్రి 08:27 వరకు.
పూజా విధానం:
ధన్తేరస్ రోజు సాయంత్రం స్నానం చేసి శుభసమయంలో పూజాకోసం సిద్ధం చేసుకోవాలి. శుభసమయంలో కొత్త బట్టలు, లక్ష్మీదేవి, వినాయకుడిని ప్రతిష్టించి..ముందుగా వినాయకుడిని పూజించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవితోపాటు కుబేరుడిని పూజించాలి. అక్షితలు, పసుపు, కుంకుమ, దుర్వ, చందనం, ధూపం, దీపం, మోదకం, లడ్డూ, పండ్లు, ఎర్రటి పువ్వులు మొదలైన వాటిని నైవేద్యంగా పెట్టి పూజించాలి.