కేంద్ర ప్రభుత్వం వ్యాపార రుణాలు.. గ్యారెంటీ అవసరం లేదు
కేంద్ర ప్రభుత్వం వ్యాపార రుణాలు.. గ్యారెంటీ అవసరం లేదు
PM Swanidhi Yojana: కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక పథకాలని ప్రవేశపెడుతోంది. వాటిలో ప్రధాన మంత్రి స్వనిధి యోజన ఒకటి. ఈ పథకం కింద వీధి వ్యాపారులకు ప్రభుత్వం ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.10,000 వరకు రుణాలు మంజూరుచేస్తోంది. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ కారణంగా వీధి వ్యాపారులు చాలా నష్టపోయారు. ఈ పరిస్థితిలో వారికి సహాయం చేయడానికి ప్రభుత్వం ప్రధానమంత్రి స్వనిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులు గ్యారెంటీ లేకుండా రుణం తీసుకుని సులభంగా తమ వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభించవచ్చు.
ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద పొందిన రుణంపై ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తోంది. ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులు తమ పనిని మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ఈ లోన్ తీసుకున్న తర్వాత ఆ రుణాన్ని తిరిగి చెల్లించడానికి మీకు 1 సంవత్సరం సమయం లభిస్తుంది. లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించిన తర్వాత మీరు మళ్లీ రుణం తీసుకోవచ్చు. తర్వాత రూ.20,000 వరకు రుణం పొందవచ్చు. మూడోసారి రూ.50,000 వరకు రుణం పొందవచ్చు.
ఈ పథకం ప్రారంభించినప్పుడు కాల పరిమితి మార్చి 2022 వరకు కేటాయించారు. తరువాత డిసెంబర్ 2024 వరకు పొడిగించారు. మీరు వీధి వ్యాపారం చేస్తుంటే సులభంగా వ్యాపార రుణం మంజూరవుతుంది. చాలా మంది ఈ పథకం ప్రయోజనాన్ని పొందారు. ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం 25 ఏప్రిల్ 2022 వరకు పీఎం స్వానిధి పథకం కింద సుమారు 32 లక్షల మంది ప్రయోజనాన్ని పొందారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వీధి వ్యాపారుల ఖాతాలోకి రూ.2,931 కోట్లను బదిలీ చేసింది.
ఇలా అప్లై చేసుకోండి..
1. ఈ పథకం కోసం దరఖాస్తు చేయడానికి pmsvanidhi.mohua.org.in క్లిక్ చేయండి.
2. ఇది కాకుండా మీరు కామన్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించడం ద్వారా కూడా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
3. మీరు ఏదైనా ప్రభుత్వ బ్యాంకుకు వెళ్లి కూడా పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
4. ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి మీరు తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా, ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను కలిగి ఉండాలి.