Pension Schemes: నేషనల్ పెన్షన్ స్కీం, అటల్ పెన్షన్ యోజనలో ఇన్వెస్ట్ చేశారా.. మరో కొత్త సదుపాయం..!
Pension Schemes: ఉద్యోగులైనా, సామాన్య వ్యక్తులకైనా రిటైర్మెంట్ ప్లాన్ లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
Pension Schemes: ఉద్యోగులైనా, సామాన్య వ్యక్తులకైనా రిటైర్మెంట్ ప్లాన్ లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే పనిచేసే ప్రతి వ్యక్తి రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే శేష జీవితం హాయిగా సాగుతుంది. ఎవ్వరిపై ఆధారపడకుండా బతకగలరు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పెన్షన్ పథకాలని అమలు చేస్తున్నాయి. అందులో ముఖ్యమైనవి నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్ పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై). ఇందులో పెట్టుబడి పెట్టిన వారు కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలి.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్), అటల్ పెన్షన్ యోజన (ఎపివై) కింద ఉన్న ఆస్తులు మొత్తం (ఎయుఎం) రూ.10 లక్షల కోట్లు దాటిపోయాయని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) చైర్మన్ దీపక్ మొహంతి తెలిపారు. ఐదు లక్షల కోట్ల నుంచి రెట్టింపు కావడానికి రెండేళ్ల 10 నెలల సమయం మాత్రమే పట్టిందని పేర్కొన్నారు. మొత్తం ఆస్తులలో ఆగస్టు 25 చివరి నాటికి ఏపీవై మొత్తం రూ.30,051 కోట్లుగా ఉంది. అలాగే ఎన్‌పీఎస్ సంఖ్య రూ.5,157 కోట్లుగా ఉంది. రెండింటి లబ్దిదారుల సంఖ్య మొత్తం కలిపి 6.62 కోట్లకు పైగా పెరిగింది.
జనవరి 1, 2004 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ (సాయుధ దళాలకు మినహా) ఎన్‌పీఎస్ వర్తిస్తుంది. చాలా రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలు కూడా కొత్త ఉద్యోగుల కోసం ఎన్‌పీఎస్ నోటిఫై చేశాయి. తర్వాత మే 1, 2009 నుంచి ప్రతి భారతీయ పౌరుడికి స్వచ్ఛందంగా అమలులోకి వచ్చింది. ఏపీవై మాత్రం జూన్ 1, 2015 న ప్రారంభించారు.
ప్రభుత్వం మరో కొత్త ప్లాన్
అయితే ఈ రెండు పథకాల లబ్ధిదారుల కోసం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ సిస్టమేటిక్ విత్ డ్రా పథకాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీనివల్ల 60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత ఖాతాదారుల కోరిక మేరకు ఒకేసారి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. అక్టోబరు, నవంబర్ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని అందరు భావిస్తున్నారు.