Online Scam: ఇలాంటి స్కామ్‌లో ఇరుక్కోవద్దు.. లక్షల రూపాయలు పోగొట్టుకోవద్దు..!
Online Scam: ఈ రోజుల్లో చాలామంది సులువుగా డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నారు.
Online Scam: ఈ రోజుల్లో చాలామంది సులువుగా డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నారు. ఎలాంటి శ్రమ లేకుండా ఇంట్లో ఉండి డబ్బుకోసం ఆరాటపడుతున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్ కేంద్రంగా ఎంచుకుంటున్నారు. ఇలాంటి వారిని కనుగొని సైబర్ నేరగాళ్లు సులువుగా మోసం చేస్తున్నారు. ఏదో ఒక విధంగా వారిని బుట్టలో పడేసి ఖాతాలో ఉన్న సొమ్ముని కొల్లగొడుతున్నారు. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఇలాంటి ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి ఆన్‌లైన్ మోసానికి గురై 40 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఇది ఎలా జరిగిందో ఈరోజు తెలుసుకుందాం.
40 లక్షలు మోసం
వృత్తిరీత్యా 3D డిజైనర్ అయిన దేవాంగ్ చౌహాన్ ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించే ప్రక్రియలో భాగంగా రూ.40 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇటీవల అతని వాట్సాప్‌కి ఒక తెలియని నంబర్ నుంచి పార్ట్‌టైమ్ ఉద్యోగం మెస్సేజ్ వచ్చింది. దీని గురించి తెలుసుకోవడానికి అతను అందులో ఉన్న నంబర్‌కు కాల్ చేశాడు. వారు యూట్యూబ్ వీడియోలను లైక్ చేయడం, ప్రమోట్ చేయడం వల్ల డబ్బు సంపాదించవచ్చని తెలిపారు.
ప్రతి గంటకు మూడు వీడియోలను లైక్ చేసి సంబంధిత యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రయిబ్ చేసినందుకు తనకి రూ.50 ఇచ్చాడని బాధితుడు పేర్కొన్నాడు. 150 రూపాయలను మొదటి చెల్లింపుగా తీసుకున్నానని తర్వాత తన నంబర్‌ను టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ చేశానని తెలిపాడు. అందులో ఉండే 166 మంది సులభంగా డబ్బు సంపాదించడం సంతోషంగా ఉందని చెప్పారని పేర్కొన్నాడు.
తనకి వచ్చిన డబ్బుని తీసుకోవడానికి ముందుగా రూ.1,500 ప్రీపెయిడ్ చెల్లించాలని అడిగారని చెప్పాడు. అవి చెల్లించాక అందులో రూ.400 తిరిగి ఇచ్చేశారు. అయితే ఈ చెల్లింపు చేయడానికి బ్యాంకింగ్ వివరాలను అడిగారు. దేవాంగ్ చౌహాన్ వివరాలు అందించడంతో మొదటగా రూ.30 లక్షలు తర్వాత మరో రూ.11 లక్షలు కాజేశారు.
ఈ విధంగా సైబర్ నేరగాళ్లు సదరు వ్యక్తిని మోసం చేసి సుమారు 40 లక్షల రూపాయలు దోచుకున్నారు. ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అందుకే ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ వింగ్ హెచ్చరిస్తోంది. గుడ్డిగా ఎలాంటి మెస్సేజ్‌లని ఓపెన్ చేయవద్దని సూచిస్తోంది.