Top 6 News Of The Day: రెడ్ బుక్ పని ప్రారంభమైందన్న లోకేష్: మరో 5 ముఖ్యాంశాలు
1. తప్పు చేసిన వారిని వదలం:రెడ్ బుక్ పై లోకేష్ సంచలనం
రెడ్ బుక్ పని ప్రారంభమైందని ఏపీ మంత్రి నారా లోకేష్ చెప్పారు. గురువారం శ్రీకాకుళంలో ఆయన పర్యటించారు. చట్టాన్ని అతిక్రమించి తప్పు చేసిన వారిని వదిలేది లేదని ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే ఐపీఎస్ లు సస్పెండయ్యారని చెప్పారు. రైట్ ప్లేస్ లో రైట్ పర్సన్ ఉండాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచనగా ఆయన చెప్పారు.
2. తిరుపతి లడ్డూ వివాదంపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
తిరుపతి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే విషయమై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి స్పందించారు. తిరుపతి ఎంతో పవిత్రమైంది. నమ్మకం లేకుండానే తిరుపతికి ఎందుకు వెళ్తున్నారని ఆయన జగన్ నుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. దేవాలయాల్లో వేరే మతాలకు చెందినవారు ఉద్యోగాలు చేయకుండా నిరోధించేందుకు టాస్క్ ఫోర్స్ టీమ్ ను ఏర్పాటు చేయాలని ఆయన ఏపీ సీఎం చంద్రబాబును కోరారు.
3. 30 రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు
విద్య, ఆరోగ్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరో 30 రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకువస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ విడివిడిగా హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలి. రాష్ట్రంలోని 4 కోట్ల హెల్త్ ప్రొఫైల్ ను డిజిటలైజ్ చేయనున్నామని ఆయన తెలిపారు.దుర్గాబాయి దేశ్ ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
4. జనసేనలో చేరిన బాలినేని, సామినేని, రోశయ్య
పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్యలు గురువారం జనసేనలో చేరారు. తమ అనుచరులతో కలిసి వీరంతా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ ముగ్గురు నాయకులు గతంలో వైఎస్ఆర్ సీపీలో ఉన్నారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ ముగ్గురు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.
5. హసీనాను గద్దెదించడంలో కుట్ర: యూనస్
బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి షేక్ హసీనాను దింపడంలో కుట్ర జరిగిందని ఆ దేశ తాత్కాలిక సారధి, మహ్మద్ యూనస్ చెప్పారు. అమెరికాలోని క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ వార్షిక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హసీనాను పదవి నుంచి దింపడంలో మహపుజ్ అబ్దుల్లా పాత్ర ఉండొచ్చని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు.
6. బిల్కిస్ బానో కేసులో గుజరాత్ సర్కార్ కు సుప్రీంలో చుక్కెదురు
బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టులో గుజరాత్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ కేసులో దోషులుగా తేలిన 11 మంది దోషులను శిక్షాకాలం పూర్తికాకుండానే శిక్షను మాఫీ చేసి విడుదల చేయడాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. దోషులతో ప్రభుత్వం కుమ్మక్కైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలను తొలగించాలని సుప్రీంకోర్టులో గుజరాత్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.