Whatsapp New Feature: వాట్సప్‌లో కొత్త ఫీచర్.. ఇక నలుగురిలో ఉన్నా ఇబ్బంది లేదు!

Whatsapp New Feature: వాయిస్‌ ట్రాన్స్‌స్క్రిప్ట్స్‌ ఫీచర్ ద్వారా వాయిస్‌ మెసేజ్‌ను వినొచ్చు. వినలేని సందర్భంలో మనం ట్రాన్స్‌స్క్రిప్ట్ చేసుకోవచ్చు.

Update: 2024-11-22 16:48 GMT

Whatsapp New Feature

Whatsapp New Feature: యూజర్లకు మెరుగైన ఫీచర్లు అందించేందుకు ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ 'వాట్సప్‌'.. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. ఇటీవలే కస్టమ్‌ లిస్ట్‌, మెన్షన్‌ ఫీచర్‌ను తీసుకొచ్చిన వాట్సప్‌.. తాజాగా వాయిస్‌ ట్రాన్స్‌స్క్రిప్ట్స్‌ ఫీచర్‌ను విడుదల చేసింది. దీని ద్వారా అవతలి వ్యక్తులు పంపించిన సందేశాన్ని టెక్ట్స్‌ రూపంలో చదువుకోవచ్చు. నలుగురిలో ఉన్నప్పుడు పర్సనల్ ఆడియో సందేశాలు వినాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలంటి ఆడియో సందేశాల (వాయిస్‌ చాట్‌) కోసమే వాట్సప్‌ వాయిస్‌ ట్రాన్స్‌స్క్రిప్ట్స్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది.

వాయిస్‌ ట్రాన్స్‌స్క్రిప్ట్స్‌ ఫీచర్ ద్వారా వాయిస్‌ మెసేజ్‌ను వినొచ్చు. వినలేని సందర్భంలో మనం ట్రాన్స్‌స్క్రిప్ట్ చేసుకోవచ్చు. సందేశం ఏ భాషలో ఉంటుందో ఆ భాషకు అక్షర రూపాన్ని ఇది ఇస్తుంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే.. వాయిస్‌ సందేశాలకు ఆటోమేటిక్‌గా టెక్ట్స్‌ రూపం కనిపిస్తుంది. అయితే ఆడియో సందేశాలు వచ్చిన వ్యక్తి మాత్రమే ఈ టెక్ట్స్‌ను చూడగలరు. ఆడియో సందేశాలు పంపించిన వారు దీన్ని వినియోగించలేరు. ఆండ్రాయిడ్‌లో ఇంగ్లిష్‌, రష్యన్‌, పోర్చుగీస్‌, స్పానిష్‌ భాషలకు ఈ ఫీచర్ సపోర్ట్‌ చేస్తోంది. ఐఓఎస్‌లో ఐతే పై భాషలతో పాటు చైనీస్‌, అరబిక్‌, ఫ్రెంచ్‌, జపనీస్‌, జర్మన్‌, ఇటాలియన్‌ వంటి భాషల్లో సపోర్ట్‌ చేస్తోంది. రాబోయే రోజుల్లో ఇతర భాషలకూ విస్తరించే అవకాశం ఉంది.

వాయిస్‌ ట్రాన్స్‌స్క్రిప్ట్స్‌ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలంటే.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ముందుగా వాట్సప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి చాట్స్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. అక్కడ వాయిస్‌ మెసేజ్‌ ట్రాన్స్‌స్క్రిప్ట్‌ కనిపిస్తుంది. అందులో ఆన్‌ లేదా ఆఫ్‌ చేసుకోవడంతో పాటు లాంగ్వేజీని ఎంచుకోవాలి. అపుడు మీ ఫోన్లో వాయిస్‌ ట్రాన్స్‌స్క్రిప్ట్స్‌ ఫీచర్‌ ఆక్టివేట్ అవుతుంది. సపోర్ట్‌ చేయని లాంగ్వేజీ, పదాలను గుర్తించని సందర్భంలో ఎర్రర్‌ వస్తుంది. ఈ విషయాన్ని వాట్సప్‌ తన బ్లాగ్‌ రాసుకొచ్చింది. త్వరలో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది. మెటాకు చెందిన వాట్సప్‌లో ఇటీవలి రోజుల్లో వరుసగా కొత్త కొత్త ఫీచర్స్ వస్తున్నాయి. అందులో కొన్ని సెక్యూరిటీకి సంబంధించినవి కూడా ఉన్నాయి.

Tags:    

Similar News