Top 6 News Of The Day: తిరుపతి లడ్డు వివాదంపై విచారణకు సిట్:మరో ఐదు ముఖ్యాంశాలు

Update: 2024-09-24 12:53 GMT

Top 6 News Of The Day

1. తిరుపతి లడ్డు వివాదంపై సిట్ : సర్వశ్రేష్ట త్రిపాఠికి బాధ్యతలు

తిరుపతి లడ్డు వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ట త్రిపాఠిని నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ సభ్యులుగా గోపినాథ్ జెట్టి, హర్షవర్ధన్ రాజు లను నియమించారు. గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్టత్రిపాఠి కొనసాగుతున్నారు. తిరుమల లడ్డు తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వుందని టీటీడీ ఈవో ప్రకటించారు. అయితే దీని వెనుక వాస్తవాలను వెలికితీసేందుకు ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం చంద్రబాబు ప్రకటించారు.

2. శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య

శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య మంగళవారం ప్రమాణం చేశారు. శ్రీలంకలో హక్కుల కార్యకర్తగా, యూనివర్శిటీ అధ్యాపకురాలిగా ఆమె గుర్తింపు పొందారు. నేషనల్ పీపుల్స్ పవర్ ఎన్ పీ పీ కి చచెందిన హరిణి అమరసూర్యతో ఆ దేశ అధ్యక్షులు అనుర కుమార దిసనాయకే ప్రమాణం చేయించారు. ఎన్ పీపీకి చెందిన ఎంపీలు విజిత హెరాత్, లక్ష్మణ్ నిపుణరచిచి కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రస్తుత పార్లమెంట్ ను మరో రెండు రోజుల్లో రద్దు చేస్తామని అధ్యక్షులు ప్రకటించారు. దీంతో నవంబర్ లో శ్రీలంకలో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి.

3. సనాతన ధర్మం జోలికి రావద్దు: పవన్ కళ్యాణ్ వార్నింగ్

సనాతన ధర్మం జోలికి రావద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ నాయకులకు సూచించారు. తప్పు జరిగితే ఒప్పుకోండి.. లేకపోతే సంబంధం లేదని చెప్పండి.. లేదా మౌనంగా ఉండండి.. కాానీ, ఏది పడితే అది మాట్లాడవద్దని ఆయన చెప్పారు. సున్నిత అంశాలపై ఇష్టారీతిలో మాట్లాడవద్దని ఆయన కోరారు. తిరుపతి లడ్డు ప్రసాదంపై పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఇదే విషయమై నటులు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడాలని ఆయన సూచించారు. లడ్డు కల్తీ నేపథ్యంలో ఆయన ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఆలయ మెట్లను శుభ్రం చేశారు.

4. కామారెడ్డి స్కూల్ లో విద్యార్ధిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్... ఆందోళన,లాఠీచార్జ్

కామారెడ్డిలోని ఓ పాఠశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థినితో టీచర్ అసభ్యంగా ప్రవర్తించారు. ఆయనను శిక్షించాలని విద్యార్థి సంఘాలు, పేరేంట్స్ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకంది. ఈ ఘర్షణలో సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ రాజారామ్ కు గాయాలయ్యాయి. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

5. నేను అవినీతిపరుడిని కాదని ప్రత్యర్థులకు కూడా తెలుసు: అరవింద్ కేజ్రీవాల్

నేను అవినీతిపరుడిని కాదని ప్రత్యర్థులకు కూడా తెలుసునని దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. తనను దొంగగా చిత్రీకరించేందుకు తనను అరెస్ట్ చేయించారని ఆయన ఆరోపించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రానియా నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. తాను అవినీతికి పాల్పడితే ఆ డబ్బంతా నా జేబులోకి వెళ్లేది.. అప్పడు ఇంత అభివృద్ది కనిపించేదా అని ఆయన ప్రశ్నించారు. నన్ను దొంగగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు.

6. ఓటుకు నోటు కేసులో విచారణకు రావాలని రేవంత్ కు నాంపల్లి కోర్టు ఆదేశం

ఓటుకు నోటు కేసులో భాగంగా ఈ ఏడాది అక్టోబర్ 16న జరిగే విచారణకు రావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని నాంపల్లి కోర్టు మంగళవారం ఆదేశించింది. ఇవాళ జరిగిన విచారణకు ముత్తయ్య సహా మిగిలిన నిందితులు హాజరు కాలేదు. దీంతో కోర్టు అసహానం వ్యక్తం చేసింది.

Tags:    

Similar News