Top-6 News of the Day: అగ్రి గోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రాజీవ్ అరెస్ట్: మరో 5 ముఖ్యాంశాలు
1. అగ్రి గోల్డ్ భూముల కేసు: జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ అరెస్ట్
అగ్రి గోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు రాజీవ్ ను ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఎ. వెంకట శేషు నారాయణ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఆగస్టు 8న కేసు నమోదు చేశారు. విజయవాడ రూరల్ లోని అంబాపురంలో సీఐడీ అటాచ్ మెంట్ లో ఉన్న అగ్రిగోల్డబ్ భూములను జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వరరావు కొనుగోలు చేశారు. ఈ భూమి రికార్డులను తారుమారు చేశారనే ఆరోపణలు వచ్చాయి. రాజీవ్ అరెస్ట్ కక్ష సాధింపు చర్యగా మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. తనపై కక్ష ఉంటే తన కొడుకుపై చూపించవద్దని ఆయన చంద్రబాబును కోరారు.
2. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీకపూర్
తిరుమల వెంకటేశ్వరస్వామిని బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ మంగళవారం దర్శించుకున్నారు. ఆమెతో పాటు ఆమె స్నేహితుడు శిఖర్ పహరియా కూడా ఉన్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని ఆమె మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏటా తిరుమల శ్రీవారిని ఆమె దర్శించుకుంటారు. తన తల్లి శ్రీదేవి పుట్టిన రోజును పురస్కరించుకొని ఆమె ఇవాళ శ్రీవారిని దర్శించుకున్నారు. బతికున్న సమయంలో ప్రతి ఏటా పుట్టిన రోజున శ్రీదేవి తిరుమలకు వచ్చేవారు. ప్రస్తుతం దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీకపూర్ నటిస్తున్నారు.
3. నేను లోకల్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై దానం నాగేందర్ ఆగ్రహం
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా పదవిపై రంగనాథ్ కు ఇష్టం లేనట్టుందన్నారు. అందుకే తనపై కేసు పెట్టారమోనని ఆయన అన్నారు. నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ అంశంపై దానం స్పందించారు. ప్రజా ప్రతినిధిగా తాను ఎక్కడికైనా వెళ్లే హక్కుందన్నారు. నందగిరి హిల్స్ అంశంలో అధికారుల వ్యవహరశైలిని ఆయన తప్పుబట్టారు. ఈ వ్యవహారంలో అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తానని చెప్పారు. కేసులు తనకు కొత్తేమీ కాదన్నారు. అధికారులు వస్తూంటారు.. పోతుంటారు.. కానీ తాను మాత్రం లోకల్ అని ఆయన చెప్పారు.
4. ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి మంగళవారం రూ. 8 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ధరణి పోర్టరల్ లో నిషేధిత జాబితా నుంచి భూమి తొలగింపునకు లంచం డిమాండ్ చేశారు. సీనియర్ అసిస్టెంట్ ద్వారా జాయింట్ కలెక్టర్ ఈ డబ్బులను తీసుకున్నంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
5. కోల్ కతా జూనియర్ డాక్టర్ పై హత్యాచారం కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగింత
కోల్ కతాలోని వైద్య కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచార కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సీబీఐకి అందించాలని పోలీస్ శాఖను ఆదేశించింది హైకోర్టు. జూనియర్ డాక్టర్ పై హత్యాచారం ఘటనపై పలు రాష్ట్రాల్లో జూడాలు నిరసనలు చేపట్టారు. మరో వైపు ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని వైద్య విద్యా నియంత్రణ సంస్థ కేఎంసీ కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించింది.
6. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసు
రిజర్వేషన్ అంశంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో బంగ్లాదేశ్ మొహమ్మద్ పుర్ లో కిరాణ దుకాణ యజమాని అబు సయ్యద్ మరణించారు. ఈ విషయమై ఆయన బంధువులు మాజీ ప్రదాని షేక్ హసీనాపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ నుంచి మాన్ స్టర్ వెళ్లిపోయిందని తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ షేక్ హసీనాపై వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు.