Guinness record: మరో అరుదైన ఫీట్‌కు సిద్ధమైన భాగ్యనగరం.. 3వేల కిలో కేక్..
Guinness Record: ఈ కేకు బరువు ఏకంగా 3,000 కిలోలు కాగా 7 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తుతో తయారు చేయనున్నారు.
Guinness Record: ఎన్నో అరుదైన రికార్డులకు, పర్యాటక ప్రదేశాలకు పెట్టింది పేరైన హైదరాబాద్ మహా నగరం మరో అరుదైన ఫీట్‌కు సిద్ధమైంది. నగరానికి చెందిన హార్లీస్ ఇండియా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లక్ష్యంగా శుక్రవారం ఓ అపురూప దృశ్యాన్ని ఆవిష్కరించనుంది. ఇందు కోసం ఏకంగా 3,000 కిలోల రష్యన్ మెడోవిక్ హనీ కేక్‌ను తయారు చేస్తున్నట్లు హార్లీస్ ఇండియా ఫైన్ బేకింగ్ సిఇఓ సురేష్ నాయక్ తెలిపారు.
హార్లీస్ నైపుణ్యాన్ని, సృజనాత్మకతను, అత్యుత్తమమైన బేకింగ్ ఆవిష్కరణలను ప్రపంచానికి చాటి చెప్పేలా, స్వచ్ఛమైన తేనెతో కేకును తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కేకు బరువు ఏకంగా 3,000 కిలోలు కాగా 7 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తుతో తయారు చేయనున్నారు. ఈ కేకు అరుదైన రికార్డును సృష్టించబోతోంది. గతంలో స్పిన్నీస్ దుబాయ్ సృష్టించిన మునుపటి రికార్డు కన్నా 10 రెట్లు పెద్దగా ఈ కేక్ ఉండనుంది. ఈ గొప్ప ప్రయత్నం పాత రికార్డులను బ్రేక్ చేస్తుందని హార్లీస్ ఇండియా ఫైన్ బేకింగ్ సీఈఓ సురేష్ నాయక్ చెప్పుకొచ్చారు.
ఈ అరుదైన అపురూప కార్యక్రమం డిసెంబర్ 6వ తేదీన హైదరాబాద్ మాయా కన్వెన్షన్ సెంటర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. దీనితో పాటే వినోద కార్యక్రమాలు, బేకింగ్ ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్ చరిత్రలో మరో అరుదైన రికార్డుకు నాంది పడనుంది.