భగవద్గీతను అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది : భారతీతీర్థ స్వామీజీ
మానవులు తమ జీవితాన్ని సార్థకం చేసుకునేందుకు భగవద్గీతను అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కడపలోని పుష్పగిరి
మానవులు తమ జీవితాన్ని సార్థకం చేసుకునేందుకు భగవద్గీతను అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కడపలోని పుష్పగిరి మఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశంకర భారతీతీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు. గీతాజయంతిని పురస్కరించుకుని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఎస్వీ హైస్కూల్ మైదానంలో శనివారం టిటిడి విద్యాసంస్థలు, ఇతర పాఠశాలలకు చెందిన సుమారు 10 వేల విద్యార్థులతో సామూహిక గీతా పారాయణం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ విద్యాశంకర భారతీతీర్థ స్వామీజీ గీతా సందేశం వినిపించారు. గీతను చక్కగా చదువుకుని అర్థం చేసుకుని ఆచరణలో పెడితే ఏ పని తలపెట్టినా విజయవంతమవుతుందన్నారు. లోకకల్యాణం కోసం మంచి పనులు చేసే ఎవరికైనా దైవత్వం ఉంటుందని, శ్రీకృష్ణ భగవానుడు పురుషోత్తముడని వివరించారు. అందరి హృదయాల్లో దేవుడు ఉంటాడని, సత్కర్మల ద్వారా ఆయన్ను తెలుసుకోవచ్చని తెలియజేశారు. మరణం దేహానికే కానీ, ఆత్మకు కాదని, చావుపుట్టుకలు నిరంతర ప్రక్రియ అన్నారు. ప్రతిఫలాన్ని ఆశించి కర్మ చేయరాదని, ఫలితాన్ని భగవంతునికే వదిలిపెట్టాలని సూచించారు.
ప్రతి ఒక్కరిలోనూ అనంతమైన శక్తి : శ్రీశ్రీశ్రీ అనుపమానందస్వామీజీ
ప్రతి ఒక్కరిలోనూ అనంతమైన శక్తి ఉంటుందని, దాన్ని తెలుసుకుంటే జన్మ ధన్యమని తిరుపతిలోని రామకృష్ణ మఠం కార్యదర్శి శ్రీశ్రీశ్రీ అనుపమానందస్వామీజీ తెలియజేశారు. భగవద్గీతలోని ఎన్నో విషయాలను సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా స్వామి వివేకానంద సూక్తుల రూపంలో అందించారని చెప్పారు. గీతను పఠిస్తే మానవులకు ఆత్మజ్ఞానం కలుగుతుందని తెలియజేశారు.