Andhra Pradesh: నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం

YSRCP Office: రాష్ట్రంలో కూల్చివేతల పర్వం మొదలయింది. 2019 జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చి తన మార్క్ పాలనకు శ్రీకారం చుడితే, ఇపుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే రిపీట్ చేసింది.

Update: 2024-06-22 06:02 GMT

Andhra Pradesh: నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం

YSRCP Office: రాష్ట్రంలో కూల్చివేతల పర్వం మొదలయింది. 2019 జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చి తన మార్క్ పాలనకు శ్రీకారం చుడితే, ఇపుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే రిపీట్ చేసింది. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసింది. శనివారం వేకువజామున 5 గంటల నుంచి భారీగా పోలీస్ బలగాలను మోహరించి, బుల్డోజర్లతో పార్టీ భవానాన్ని కూల్చివేశారు.

నిర్మాణం చివరిదశలో ఉన్న భవనాన్ని పూర్తిగా కూల్చివేశారు. అది ఇరిగేషన్ శాఖ భూమి అని, కనీసం ప్లాన్ కోసం కూడా వైసీపీ దరఖాస్తు చేసుకోలేదని, అందువల్లనే కూల్చివేసినట్టు సీఆర్డీఏ అధికారవర్గాలు వెల్లడించాయి.

తాడేపల్లిలోని 202/A1 సర్వే నంబర్ లో రెండకరాల భూమిని ఆక్రమించి పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని ఆరోపణలున్నాయి. అదే సర్వే నెంబరులో దాని పక్కనే ఉన్న మరో 15 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేశారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ స్థలం స్వాధీనానికి ఇరిగేషన్ శాఖ అంగీకారం లేదని చెబుతున్నాయి.

సీఆర్డీఏ, ఎంటిఎంసి, రెవెన్యూ శాఖలు ఇరిగేషన్ భూమిని వైసీపీకి హ్యాండోవర్ చేయలేదు. కార్యాలయం నిర్మాణానికి కనీసం ప్లాన్ కోసం దరఖాస్తు చేయలేదు. టీడీపీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు సీఆర్డీఏ, ఎంటిఎంసీ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసి ఇరిగేషన్ భూమిని స్వాధీనం చేసుకుంది.

ఇది కోర్టు ధిక్కరణ అంటున్న వైసీపీ

నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలన్న సీఆర్డీఏ ప్రిలిమినరీ ప్రోసీడింగ్స్ ను సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ సమయంలో చట్టాన్ని మీరి వ్యవహరించవద్దని హైకోర్టు సూచించినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని సీఆర్డీఏ కమిషన్ దృష్టికి వైసీపీ న్యాయవాది తీసుకెళ్ళారు. ఇపుడు ఎలాంటి నోటీసులివ్వకుండానే కూల్చివేశారని వైసీపీ చెబుతోంది. కోర్టు ధిక్కరణపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇది చంద్రబాబు హింసాత్మక సందేశమన్న వైఎస్. జగన్

నిర్మాణంలో ఉన్న వైపీసీ కార్యాలయం కూల్చివేతపై సీఎం జగన్ స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టారు. ఇది కక్ష సాధింపు చర్య అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని విమర్శించారు.

తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన కేంద్ర కార్యాలయాన్ని చంద్రబాబు ఒక నియంతలా బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నానని జగన్ ఎక్స్‌లో రియాక్ట్ అయ్యారు.

అయితే, గతంలో ప్రభుత్వం తమదే కనుక అన్ని నిబంధనలను ఉల్లంఘించి జగన్ ఈ నిర్మాణం చేపట్టారని చెబుతున్న టీడీపీ నాయకులు, వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే అనుమతులన్నీ లాంఛన ప్రాయమయ్యేవని అంటున్నారు. అంటే, ప్రభుత్వాలు మారడంతో రాష్ట్రంలో కూల్చివేతల పర్వం మొదలైంది.

Tags:    

Similar News