Andhra Pradesh: వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారో నిగ్గు తేలాల్సిందే- విజయమ్మ
Andhra Pradesh: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై వైఎస్ విజయమ్మ ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు.
Andhra Pradesh: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై వైఎస్ విజయమ్మ ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. వివేకాను ఎవరు హత్య చేశారో నిగ్గు తేల్చాల్సిందే అని డిమాండ్ చేశారు. ఇది నా మాట, జగన్ మాట, షర్మిల మాటన్నారు. ఇందులో తమ కుటుంబానికి రెండో అభిప్రాయం లేదని లేఖలో స్పష్టం చేశారు. హత్య తర్వాత రెండున్నర నెలలు చంద్రబాబు సీఎంగా ఉన్నారు. ఈ హత్యకు సంబంధించి ఆయన మంత్రి, పార్టీ ఫిరాయించిన ఆదినారాయణరెడ్డి పాత్రమీద అనేక అనుమానాలున్నాయన్నారు.
ఆదినారాయణరెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారని విజయమ్మ అన్నారు. ఆయన్ను తిరుపతిలో స్టేజీమీద పెట్టుకున్న పవన్ కళ్యాణ్, దర్యాప్తు సీబీఐ చేతిలో అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని తెలిసీ జగన్ మీద విమర్శలు చేశారని విజయమ్మ లేఖలో పేర్కొన్నారు. జగన్ మీద హత్యాయత్నం 2018 అక్టోబర్‌లో జరిగితే 2019 మే చివరి వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నారని లేఖలో అన్నారు. వివేకానంద రెడ్డి వర్ధంతికి నివాళులు అర్పించకుండా ఎవరో అడ్డుకున్నారన్నది బూటకమన్నారు. నిజానికి ఆ సందర్భంలో తనను హాజరు కావాల్సిందిగా జగన్ తనకు చెప్పారన్నారు.
మరోవైపు తెలంగాణలో షర్మిల పార్టీ స్థాపనపై విజయమ్మ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా సత్సంబంధాలు ముఖ్యమని భావించినందువల్ల వైఎస్సార్ కాంగ్రెస్‌ను తెలంగాణలో నడిపించటం కుదరదని స్పష్టం చేశారు. ఈ ప్రాంతపు కోడలిగా తాను ప్రజల్లో ప్రజాసేవలో ఉండాలని షర్మిలమ్మ నిర్ణయించుకుందని లేఖలో పేర్కొన్నారు. ఇవి వేర్వేరు అభిప్రాయాలే తప్ప వారిద్దరి మధ్య విభేదాలు లేవన్నారు.