అంతర్గత సమస్యలపై వైసీపీ సీరియస్ ఫోకస్.. మైలవరం నియోజకవర్గంలో వసంత వర్సెస్ జోగి
* ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నం.. సోమవారం సమన్వయభేటీ నిర్వహిస్తామన్న సజ్జల
YCP: పార్టీలో అంతర్గత సమస్యలపై వైసీపీ అధిష్టానం సీరియస్‌గా ఫోకస్ చేసింది. జిల్లాల్లో పార్టీ అధ్యక్షులను మార్చడమే కాదు నాయకుల మధ్య విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా మైలవరం పంచాయితీని తెగ్గొట్టేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. రసవత్తరంగా సాగుతున్న వసంత వర్సెస్ జోగి రమేశ్ ఎపీసోడ్ బాల్ సజ్జల కోర్టులో పడింది. దీంతో ఇద్దరి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరులో సయోధ్య కుదిర్చేందుకు మధ్యలో సజ్జల రాయబారం నడుపుతున్నారు.
ఈ సందర్భంగా వసంత కృష్ణ చేసిన కామెంట్స్ మైలవరం రాజకీయాల్లో హీటెక్కించాయి. పార్టీలో కొందరు తనను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని వసంత కృష్ణ ఆరోపించారు. తాను పార్టీ మారతానని, మైలవరం నుంచి కాకుండా మరో చోటు నుంచి పోటీ చేస్తానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సజ్జలను కలిసిన వసంత కృష్ణ విషయంపై వివరణ ఇచ్చారు. తన ఆరోపణలపై ఆధారాలను సమర్పించారు. ఇటు మంత్రి జోగి రమేశ్ కూడా సీఎం క్యాంప్ కార్యాలయంలో సజ్జలతో భేటీ అయ్యారు. వసంత చేసిన కంప్లైంట్స్‌పై వివరణ ఇచ్చుకున్నారు. వసంత కృష్ణతో తనకెలాంటి విభేదాలు లేవని వివరించారు.
వాస్తవానికి మైలవరం నియోజకవర్గంలో గత కొంత కాలంగా ఎమ్మెల్యే వర్సెస్ మినిస్టర్ మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ నేపథ్యంలో తనపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారంపై స్పందించిన వసంత కృష్ణ తాను పార్టీ మారేది లేదని జగన్ నాయకత్వంలో వైసీపీ నుంచే చేస్తానని స్పష్టం చేశారు. మైలవరం నుంచే బరిలో ఉంటానని తేల్చిచెప్పారు. జగన్ చెప్పినట్లుగా నడుచుకుంటానని చెప్పుకొచ్చారు. అయితే ఇదే అంశంపై సజ్జలను కలిసిన మంత్రి జోగి రమేశ్ వసంత చేసిన ఆరోపణలపై వివరణ ఇచ్చుకున్నారు. ఇక ఈ ఓవరాల్ ఎపీసోడ్‌కు సంబంధించి ఇద్దరి అభిప్రాయాలను తెలుసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చే సోమవారం సమన్వయ భేటీ నిర్వహించనున్నట్లు తెలిపారు.