చందమామ కథలో లాగా రెక్కల గుర్రాలుంటాయనుకున్నారు. బాలమిత్ర కథలో లాగా పగడపు దీవులు ఉంటాయని ఊహించారు. అబ్బాయ్ అధికారంలోకి రాగానే, బాబాయ్ రెక్కల గుర్రాలెక్కి వచ్చి, పగడపు దీవికి తీసుకెళ్ళకపోయినా, పదవుల్లో ఊరేగడం ఖాయమని కలలు కన్నారు. కలలు కల్లలయ్యాయి. పగటి కలల్లోని భ్రమలు తొలగిపొయాయి. రెండేళ్ళుగా అధికార పార్టీలోని, ప్రత్యర్థి వర్గం బలంగా తొక్కుతున్నా, బాబాయ్ ఏదో చేస్తాడని ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చి రెండేళ్ళు కావస్తున్నా ప్రకాశం జిల్లాలో వైవి సుబ్బారెడ్డినే నమ్ముకుని నడుస్తున్న అనుచర గణం అవస్థలపై ఆఫ్ ది రికార్డ్.
వైవీ సుబ్బారెడ్డి. సీఎం జగన్‌కు కుడి భుజం. పార్టీలో ట్రబుల్ షూటర్. ప్రభుత్వంలో కీలకమైన నాయకుడు. అధికారంలోకి రాగానే, టీటీడీ చైర్మన్ పదవి వరించింది. ఎన్నికల్లో విజయం సాధించగానే, ఆయన సొంత జిల్లా ప్రకాశంలో ఎంతోమంది, ఆయన వెంట తిరిగిన అనుచరులు, నేతలు చాలా ఆశలు పెట్టుకున్నారట. అబ్బాయ్ అఖండ విజయంతో, ఇక బాబాయ్ పవర్ అమాంతం పెరిగిపోతుందనుకున్నారు. ఇదే లెక్క, ప్రకాశం జిల్లాలో కొన్ని వందల మంది ద్వితీయ శ్రేణి నాయకులను సుబ్బారెడ్డికి వశం చేసింది. ఆయన పంచన చేరితే, భవిష్యత్తుకు భరోసా దొరుకుతుందని భావించారు. పార్టీ అధికారంలోకి రాని రోజుల్లోనే ఎంపీగా గెలిచిన ఆయనకు, ఇక తిరుగేముంటుందని భావించి భుజం కాశారు. పార్టీ అధికారంలో లేని రోజుల్లో ఆర్థిక భారాలను మోసారు. పవర్‌లోకి వచ్చాక అబ్బాయ్..బాబాయ్ మాట కాదంటారా మనకు దారి చూపక పోతారా? అన్న ఆశ వారిని సుబ్బారెడ్డి వెంట నడిపించింది. అయితే ఆశలు అడియాశలు అయ్యాయట. రెండేళ్ళు గడుస్తున్నా, సుబ్బారెడ్డి వర్గానికి ఏ పదవులూ రాకపోగా, కనీసం ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కూడా జరగకపోతుండటంతో, ఆవేదన చెందుతున్నారట అనుచరులు.
ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేని అన్నీ తానై నడిపిస్తున్నారు. సుబ్బారెడ్డి టిటిడి ఛైర్మన్ అయ్యాక కూడా, పరిస్థితుల్లో మార్పులేదు. అధికారులు, అనధికారుల వద్ద బాలినేని మాటే చెల్లుబాటవుతోంది. బాబాయ్ మనుషులం అంటున్న వారికి, మొండి చేయి మిగులుతోందట. తాజాగా జరిగిన పదవుల పందేరంలోనూ, వైవి వర్గానికి ఒక్క పదవీ దక్కలేదు. తన సొంతం అనుకున్న పార్లమెంటు నియోజక వర్గంలోని శిష్య గణం సైతం నిస్తేజానికి లోనవుతున్నారట. వైవి టిటిడి ఛైర్మన్ అయ్యాక, కొడుకు విక్రాంత్ రెడ్డి చురుగ్గా కార్యకలాపాలు నడుపుతున్నా, ఆయన స్టైల్ వేరుగా ఉంది. పాత కాపులను పట్టించుకోకుండా కుర్రకారుతో రాజకీయాలు చేస్తున్నారు. జిల్లాలో గానీ, ఒంగోలు పార్లమెంటు పరిధిలోగానీ, పట్టు సాధించే పరిస్థితి కానరావడం లేదు. అదే సమయంలో బాలినేని శ్రీనివాస రెడ్డి మంత్రి కావడంతో, జిల్లాలోని 12 నియోజకవర్గాల్లోనూ, అభిమానులు పెరిగిపోతున్నారు. ఆయన కుమారుడు సైతం సొంతంగా అనుచరగణం పెంచే పనిలో ఉన్నారట. దీంతో వైవీ వర్గీయులు ఇప్పటికే కొందరు పొలిటికల్ గా సైలైంట్ అయిపోగా, మరికొందరు బాలినేని చల్లని చూపు కోసం ఎదురు చూస్తున్నారు.
వైవి టిటిడి ఛైర్మన్ గా నియమితులై ఏడాది దాటిపోయింది. అనుచరులు చేసిన సిఫారసులకు ఛైర్మన్ తరపున శ్రీవారి దర్శనాలు జరగడం లేదన్న అసంతృప్తి కూడా కొంత రాజుకుంది. ద్వితీయ శ్రేణి నాయకులు కూడా తమ వారికి తిరుమల దర్శనం కావాలంటే, పిఎల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుండటంతో, కొందరు వైవి వద్దకు రావడం తగ్గించినట్లుగా చెప్పుకుంటున్నారు.
రాజశేఖరరెడ్డి జమానాలో జిల్లాలో ఓ వెలుగు వెలిగారు వైవి. జిల్లావ్యాప్తంగా ఎందరు బడానేతలున్నా, ఈయన స్థానం పదిలంగా ఉండేది. ఆయనకు అంతటి ప్రాధాన్యత ఉండేది. వైసిపిలో కూడా మొదట్లో అదే పట్టు ఉన్న వైవికి, క్రమంగా పట్టు సడలుతోందన్న ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల ముందు జరిగిన పరిణామాల్లో, బాలినేని, విజయసాయిరెడ్డిలు ఏకమవడంతో ఈయన ఒంటరయ్యారట.
అబ్బాయ్ అధికారంలోకి రావడం కోసం, చాలా వరకు కాంప్రమైజ్ అవుతూ వచ్చిన ఆయన, ఇప్పుడు కామ్ అయిపోయారట. ఆ తరువాత కూడా ఎప్పుడూ పూర్వ స్థితిని పొందడానికి రాజకీయ ఎత్తుగడలు మొదలు పెట్టలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే అనుచర గణం పరిస్థితి అటుంచితే, సొంత కొడుకు రాజకీయ భవిష్యత్ ఏమవుతుందోనన్న చర్చ కూడా సాగుతోంది. ఒంటరి వాడైపోయారు, ఇక ఆయన ఇంటికి ఏం పని అనే సెటైర్లు అక్కడక్కడా వినిపిస్తున్నాయి. బాబాయ్ బలం పుంజుకోక పోతే భవిష్యత్తు ప్రశ్నార్థకమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి సుబ్బారెడ్డిపై ఏవేవో ఆశలు పెట్టుకున్న అనుచరులు, ఆశలు కాస్తా అడియాశలు అవుతున్నాయంటూ, తీవ్ర నిర్వేదానికి లోనవుతున్నారని అర్థమవుతోంది. అయితే, కొంతకాలం ఆగాలని, ఎవర్నీ మర్చిపోనని, ప్రతి ఒక్కరి జీవితంలో అభివృద్దికి కృషి చేస్తానని సర్దిచెబుతున్నారట వైవీ సుబ్బారెడ్డి.