Why is Naidu scared of Amul's collaboration with AP govt: అమూల్‌తో ప్రభుత్వం ఒప్పందం చంద్రబాబులో గుబులెందుకు?

Update: 2020-07-26 11:38 GMT

Why is Naidu scared of Amul's collaboration with AP govt : అమూల్‌ పాలు...తాగుతోంది ఇండియా. టీవీల్లో మార్మోగే అడ్వర్టయిజ్్మెంట్‌ స్లోగన్ కదా. ఇప్పుడు ఇదే అమూల్‌ బేబీ, చంద్రబాబు గారింట్లో చిచ్చు పెట్టేసిందట. తెలుగుదేశానికి ఆయువుపట్టయిన ఆర్థిక సంస్థలో కుంపట్లు రాజేస్తోందట. వైసీపీ విసిరిన అమూల్‌ అస్త్రానికి, బాబులో దిగులెందుకు? ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల తాజా క్షీరసాగర మథనంలో, చంద్రబాబుకు అమూల్‌తో అమృతమా హాలాహలమా?

దేశంలో ప్రఖ్యాత పాల ఉత్పత్తుల కంపెనీ అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్టు అట్టహాసంగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. అదే ఇప్పుడు చంద్రబాబు మదిలో గుబులు రేపుతోంది. అమూల్‌తో సర్కారు ఎంవోయూతో, తన ఆర్థిక మూలాలకు మూలస్తంభమైన హెరిటేజ్‌కు అతిపెద్ద దెబ్బ పడుతుందన్నది బాబు టెన్షన్.

ఆంధ్రప్రదేశ్‌లో హెరిటేజ్ కు ప్రత్యేకత ఉంది‌. పాలు, పాల ఉత్పత్తుల వ్యాపారంలో అగ్రస్థానం ఆ కంపెనీదే. చంద్రబాబు అధికారంలో ఉన్న కాలంలో హెరిటేజ్ ఉత్పత్తులు, హెరిటేజ్ ఫ్రెష్ లోని వస్తువులను ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసింది. ఈమేరకు ఒప్పందం కూడా వుండేది. దీంతో భారీగా ప్రభుత్వ కార్యకలాపాల్లో హెరిటేజ్‌ ఫుడ్సే దర్శనమిచ్చేవి. హెరిటేజ్‌ సరుకులు సరఫరా చేసి, కోట్లు కొల్లగొట్టారని నాడు ప్రతిపక్షంగా వున్న వైసీపీ ఆరోపణలు కూడా చేసింది. టీడీపీ హయాంలో హెరిటేజ్ షేరు మాత్రమే కాదు, బిజినెస్‌ కూడా నింగిని తాకింది. హెరిటేజ్ లాభాల కోసం ఏకంగా సహకార డెయిరీలను చంద్రబాబు దెబ్బతీశారనే ఆరోపణలూ ఉన్నాయి. ఇప్పుడు, అమూల్‌-ఏపీ సర్కారు ఒప్పందంతో, హెరిటేజ్‌కు భారీ దెబ్బ పడబోతోందన్న చర్చ జరుగుతోంది.

ఎప్పటికైనా ఈ వ్యాపారంతో తనను ఇరకాటంలో పెడతారని గ్రహించిన బాబు, 2014 ఎన్నికలకు ముందే హెరిటేజ్ లో ప్రధాన వాటాను ఫ్యూచర్ గ్రూప్ కు విక్రయించారు. పాలు,పాల ఉత్పత్తులు చంద్రబాబు కుటుంబమే చూస్తోంది. అమూల్ తో ఒప్పందం నేరుగా హెరిటేజ్ వ్యాపారంపై, భారీ ప్రభావమే చూపిస్తుందన్న మాటలు వినపడుతున్నాయి. ప్రభుత్వ పరంగా కొనుగోళ్ళు, అంగన్ వాడి స్కూళ్ళు, హాస్టళ్లు మొదలు బహిరంగ సభలు సమావేశాలకు కొనుగోళ్ళు ఆగిపోతాయి. కేవలం అమూల్‌ బేబీ మాత్రమే, అందరి చేతుల్లో నాట్యమాడుతుంది.

అమూల్‌కు నేరుగా ప్రభుత్వ సహకారం ఉంటుంది. సహకార రంగానికి వర్తింపజేసే అన్నిరకాల ప్రోత్సాహకాల్ని గనుక, జగన్ ప్రభుత్వం అమూల్‌కు కూడా అప్లై చేస్తే, అది హెరిటేజ్‌కు పెద్ద దెబ్బేనన్న చర్చ జరుగుతోంది. అంటే అమూల్‌తో ఓ పెద్ద పోరాటమే చేయాల్సి ఉంటుంది హెరిటేజ్‌కు. పార్టీని కాపాడుకునే క్రమంలో చంద్రబాబుకు మనసంతా ఒత్తిడి, చేతినిండా పని వుంది. లోకేష్‌ కూడా పొలిటికల్‌గా బిజీనే. భువనేశ్వరి హెరిటేజ్‌లో కీలక పాత్రధారి అయినా, మొత్తం కంపెనీ వ్యవహారాలు చూసేది మాత్రం లోకేష్ భార్య బ్రాహ్మణే. ఇప్పటికే హెరిటేజ్‌‌ను సరైన ట్రాక్‌లో పెట్టారని పేరు తెచ్చుకున్న బ్రాహ్మణికి, ముందున్నది టఫ్ టాస్కే. మొత్తానికి ఏపీలో అమూల్‌ రంగ ప్రవేశం, చంద్రబాబు సపరివారానికి కీలకమైన హెరిటేజ్‌కు టఫ్ ఫైటే. ముఖ్యంగా పార్టీకి ఆర్థిక వనరుల్లో ఇబ్బంది తప్పదు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో పార్టీకి ఫైనాన్షియల్‌గా వెన్నుదన్నుగా వున్న నేతలు సైతం, వైసీపీ గూటికి చేరిపోయారు. చాలామంది క్యూలో వున్నారు. దీంతో తెలుగుదేశానికి ఆర్థిక అండదండలు అందించేవారు కరువు అవుతున్నారు.


Full View


Tags:    

Similar News