Atchutapuram: ఎసైన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో అసలేం జరిగింది... పారిశ్రామిక ప్రమాదాలతో వణికిపోతున్న ఉమ్మడి విశాఖ
అచ్యుతాపురం సెజ్ లోని ఎసైన్సియా కెమికల్ ఫ్యాక్టరీలో ఆగస్టు 21న పేలుడు జరిగింది. ప్యాక్టరీలోని సాల్వెంట్ లీకేజీ కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.
అచ్యుతాపురం సెజ్ లోని ఎసైన్సియా కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడుతో 17 మంది కార్మికులు మరణించారు. 36 మంది గాయపడ్డారు. ఈ ఘటన మరోసారి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పరిశ్రమల్లో సేఫ్టీ నిబంధనలు పాటించలేదని రుజువు చేసింది. ఈ ప్రాంతంలో చాలా పరిశ్రమలున్నాయి. గతంలో జరిగిన ప్రమాదాలు ఎంతో మంది ప్రాణాలు తీశాయి. ఇలాంటి వరుస ప్రమాదాలు జిల్లా ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఎసైన్సియా కెమికల్ ఫ్యాక్టరీలో ఏం జరిగింది?
అచ్యుతాపురం సెజ్ లోని ఎసైన్సియా కెమికల్ ఫ్యాక్టరీలో ఆగస్టు 21న పేలుడు జరిగింది. ప్యాక్టరీలోని సాల్వెంట్ లీకేజీ కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. రియాక్టర్ లో తయారైన మిథైల్ టెర్ట్ - బ్యుటెల్ ఈథర్ మిశ్రమాన్ని స్టోరేజీ ట్యాంకులోకి మార్చే సమయంలో లీకేజీ జరిగిందని... ఇదే పేలుడుకు కారణమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఈ పేలుడు ధాటికి పైకప్పు కుప్పకూలింది. అంతేకాదు మృతదేహలు ఎగిరిపడ్డాయి. ఫ్యాక్టరీకి వెలుపల ఉన్న చెట్టుకొమ్మపై శరీర భాగాలు పడ్డాయి. లంచ్ టైంలో ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య తక్కువగా ఉంది. సాధారణంగా ఒక్క షిప్ట్ లో 381 మంది పనిచేస్తారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో వరుస ప్రమాదాలు
ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో పరవాడ ఫార్మాసిటీలో 90, అచ్యుతాపురం సెజ్ లలో 208 ఫ్యాక్టరీలున్నాయి. ఈ రెండు సెజ్ లలో 130 వరకు రెడ్ కేటగీరికి చెందిన పరిశ్రమలున్నాయి. ప్రమాదకరమైన ఫ్యాక్టరీల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.
2020 మే 7న ఎల్జీ పాలీమర్స్ లో స్టెరీన్ గ్యాస్ లీకైన ఘటనలో 12 మంది మరణించారు. 1997 సెప్టెంబర్ 14న హెచ్ పీ సీఎల్ లో పేలుడు ఘటనలో 22 మంది మరణించారు. 2012 జూన్ 13న విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ లో ఆక్సిజన్ ప్లాంట్ ట్రయల్ రన్ సమయంలో జరిగిన ప్రమాదంలో 11 మంది కార్మికులు చనిపోయారు.
2020 ఆగస్టు 1న హిందూస్థాన్ షిప్ యార్డులో క్రేన్ ప్రమాదంలో 11 మంది మరణించారు. 2022 ఆగస్టులో బ్రాండిక్స్ ఫ్యాక్టరీలో విషవాయువుల విడుదలతో 539 మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు.
ప్రమాదాలు జరిగిన సమయంలో ఫ్యాక్టరీల్లో భద్రత విషయమై అధికారులు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత చూసీ చూడనట్టు వదిలేయడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కార్మిక సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.
నీరబ్ కుమార్ ప్రసాద్ కమిటీ నివేదిక ఏం చెప్పింది?
ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీలో స్టెరీన్ గ్యాస్ లీకైన ప్రమాదంలో 12 మంది కార్మికులు మరణించిన ఘటనపై అప్పటి జగన్ ప్రభుత్వం నీరబ్ కుమార్ ప్రసాద్ నేతృత్వంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ఈ ప్రమాదానికి గల కారణాలను వివరించింది.
ప్రమాదకర పరిశ్రమలను నివాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని సూచించింది. ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీని కూడా ప్రస్తుతం ఉన్న స్థలానికి దూరంగా తరలించాలని సిఫారసు చేసింది. ఈ ప్రమాదం తర్వాత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం 156 జీవో విడుదల చేసింది.
కాకినాడ పెద్దాపురం అంబటి సుబ్బన్న ఆయిల్స్ లో ప్రమాదం జరిగి ఏడుగురు చనిపోయారు. ఈ ప్రమాదం తర్వాత 79 జీవో తెచ్చారు. పరిశ్రమల శాఖ, కాలుష్య నియంత్రణ బోర్డు, ఇన్స్ పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కార్మిక శాఖ అధికారులు నిరంతరం ఫ్యాక్టరీలను తనిఖీ చేయాలి.
అంతేకాదు ఆయా ఫ్యాక్టరీల్లో భద్రతా ప్రమాణాలపై థర్డ్ పార్టీ తో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని కోరింది. ఈ సిఫారసులు సక్రమంగా అమలు కాలేదు. దీంతో విశాఖపట్టణం జిల్లాలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎసైన్షియా విషాదంతోనైనా ప్రభుత్వం మేల్కొంటుందా?