విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల లెక్కలపై అయోమయం

*7వేల ఎకరాలు భూములను మిగులుగా చూపినట్లు ప్రచారం

Update: 2022-05-20 02:27 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల లెక్కలపై అయోమయం

Vizag Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగారంలో భూముల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్టీల్ ఫ్లాంట్ లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతుండగానే, మరో కొత్త ప్రక్రియ కలకలం రేపుతోంది. ఉక్కులో సుమారు ఏడు వేల ఎకరాలకు పైగా భూములను అధికారులు మిగులుగా చూపినట్లు ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలు ఉక్కు ఉద్యోగ వర్గాల్లో ఆందోళన రేపుతున్నాయి.

విశాఖ స్టీల్ ఫ్లాంట్ ఏర్పాటు సమయంలోనే సుమారు 23 వేల ఎకరాల భూమిని సేకరించారు. దాదాపు 6,800 ఎకరాల్లో బ్లాస్ట్ఫర్నేస్ లు, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేశారు. భవిష్యత్తు అవసరాలకు వీలుగా కొంత భూమిని సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం సంస్థ సామర్థ్యం 7.3 మిలియన్ టన్నులకు చేరింది. 20 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి అనువైన భూములు కర్మాగారంలో ఉన్నాయి. నిబంధనల మేరకు 33 శాతం మేర పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలి. అందుకు అనుగుణంగా సంస్థ ప్రాంగణంలో ఏకంగా 50లక్షలకు పైగా మొక్కలు గతంలోనే నాటారు. పచ్చదనం ఉన్న విస్తీర్ణం సమారు 7,500 ఎకరాలకు పైగా ఉంటుందని అంచనా. ఉద్యోగులు, కార్మికులకు నాలుగు వేలకు పైగా ఎకరాల్లో టౌన్ షిప్ అభివృద్ధి చేశారు.

దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలకున్న భూములను సమర్థంగా వినియోగించుకోవాలన్న లక్ష్యంతో కేంద్రం అన్నిశాఖల పరిధిలోని కార్యాలయాలు, కర్మాగారాల భూముల వివరాల్ని సేకరించింది. ఫ్లాంట్ ప్రాంగణాల్లో ఎంత మిగులు భూమి ఉందన్న వివరాలు కూడా తీసుకున్నారు. భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా ఉక్కు కర్మాగార భూముల్ని సేకరించారన్న వాస్తవాన్ని విస్మరించి, ఉక్కులో వేలాది ఎకరాలను మిగులు భూములుగా చూపుతూ నివేదిక పంపారని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కు అధికారులు స్టీల్ ఫ్లాంట్ లో సుమారు ఏడు వేల ఎకరాలను మిగులు భూములుగా చూపినట్లు తెలుస్తుందని, సంస్థ భవిష్యత్తు అవసరాలకు లేకుండా మిగులు భూములను విక్రయం చేస్తే సంస్థ గతి ఏమవుతుందని కార్మిక సంఘ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో విశాఖ స్టీల్ ఫ్లాంట్ ను ప్రైవేటుపరం కానివ్వమని హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News