రామతీర్థం వివాదం.. ఉత్తరాంధ్రలో పొలిటికల్ హీట్.. ఈ ఎన్నికలలో తేలిపోనున్న భవితవ్యం

Update: 2021-01-28 13:00 GMT

రామతీర్థం వివాదం.. ఉత్తరాంధ్రలో పొలిటికల్ హీట్.. రాజకీయ పార్టీల దృష్టి ఆ వైపే

ఉత్తరాంధ్రలో పొలిటికల్ హీట్ మరింత రాజుకుంది. రామతీర్థం వ్యవహారం చల్లారక ముందే పంచాయితీ పోరు ప్రారంభం కావడంతో రాజకీయ పార్టీలన్నీ ఉత్తరాంధ్రపైనే దృష్టి సారిస్తున్నాయి. దానికి తోడు. రామతీర్ధం వ్యవహారంలో అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలు కూడా వీలైనంత మైలేజీ సాధించాయి. అయితే రామతీర్థం వివాదంలో ఏ పార్టీకి ఎన్ని మార్కులు పడతాయనేది ఈ ఎన్నికలలో తేలిపోతుందని భావిస్తున్నారు.

ఉత్తరాంధ్ర పాలిటిక్స్ రామతీర్థం ఘటనకు ముందు తర్వాత అన్నంతగా మారిపోయాయి. టీడీపీని బలహీన పరచడానికి అధికార పార్టీ వ్యూహాలు ఇప్పటికే ఫలించాయని చెప్పాలి. టీడీపీ బడా నేతల అరెస్టులు, కేసులతో ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలో పడేసింది వైసీపీ. అరెస్టు తర్వాత బయటకొచ్చిన అచ్చెన్న సైతం దూకుడు తగ్గించారనే చెప్పాలి. అటు మరో సీనియర్ నేత అశోక్ మాన్సాస్ వ్యవహారంలో తలమునకలై ఉన్నారు. నాలుగు అసెంబ్లీ స్థానాలను సాధించిన విశాఖ పరిథిలోనూ సేమ్ సీన్. దానికి తోడు ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, గణబాబులను ఆరోపణలు వెంటాడుతున్నాయి.

మరోవైపు.. వైసీపీ మాత్రం మరింత వ్యూహాత్మకంగా టీడీపీని మరింత బలహీన పరిచే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ తెలుగు దేశం పార్టీ సీనియర్ నేతలు పోరాడుతూనే ఉన్నారు. అయితే.. బడా నేతల నుంచి చోటా నేతల వరకూ అనేక ఆరోపణలు, కేసులు, అరెస్టులతో ఉత్తరాంధ్ర టీడీపీలో గందరగోళం నెలకొంది. అధికార పార్టీపై టీడీపీ సీనియర్లు ఎదురుదాడికి దిగినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే రామతీర్థం రగడ రాజుకుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో టీడీపీ సాధించింది ఏంటి అన్నది మాత్రం పంచాయితీ పోరు తర్వాతే తేలనుంది.

అటు రామతీర్ధం వ్యవహారంలో బీజేపీ, జనసేన మాత్రం పూర్తి మైలేజీ పొందాలని చేసిన ప్రయత్నాలు కొంతమేర వర్క్‌ఔట్ అయ్యాయనే చెప్పాలి. అయితే ఈ రెండు పార్టీల్లో బీజేపీ కాస్త ఎక్కువ లబ్ది పొందినట్లు కనిపిస్తోంది. రామతీర్ధం విషయంలో జాతీయ, రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలంతా ఉత్తరాంధ్రపైనే దృష్టి సారించారు. దీంతో బీజేపీ, జనసేనలు ఉత్తరాంధ్రలో పూర్తి స్థాయి పట్టు బిగించేందుకు ఇదే సరయిన తరుణంగా భావిస్తున్నాయి. ఇక సుప్రీం తీర్పుతో పంచాయితీపై దిగొచ్చిన ప్రభుత్వం మూడు జిల్లాల్లో సర్పంచ్‌ అభ్యర్థుల ఎంపిక పై దృష్టి సారించింది. మూడు జిల్లాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక, గెలింపించే బాధ్యతను ఆయా నియోజక వర్గాల వైసీపీ ఎమ్మెల్యేలకే అప్పగించింది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రారంభించిన మంత్రులు, ఎమ్మెల్యేలు వైసీపీ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పంచాయితీ ఎన్నికల్లో అధిక స్థానాలను గెలిపించుకొని సీఎం జగన్‌కు బహుమతిగా ఇవ్వాలని వైసీపీ నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. అటు ప్రతిపక్ష టీడీపీ గ్రామస్థాయిలో ఆదరణ ఉన్న నాయకులను బరిలోకి దించుతున్నారు. మిత్ర పక్ష పార్టీలు బీజేపీ, జనసేనలు కూడా సర్పంచ్ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర పంచాయితీ పోరుపై రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Tags:    

Similar News