Trains speed will Increase in AP: ఏపీలో పెరగనున్న రైలు వేగం.. గంటకు 130 కి.మీల వరకు
Trains speed will Increase in Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ లో రేలుబండి వేగం పెరగనుంది. ఈ మేరకు భారత రైల్వేలు ఏర్పాట్లు చేశాయి.
Trains speed will Increase in Andhra pradesh: మనం రైలులో ప్రయాణం చేసేటప్పుడు ఇది ఎడ్ల బండిలా వెళ్తుంది వంటి మాటలు వింటు ఉంటాం. దీనికి అర్థం ఏమిటంటే ఆ ట్రైన్ నెమ్మదిగా వెళ్తున్నట్టు లెక్క. ఇక నుంచి ఈ ఎడ్ల బళ్లకు స్వస్తి చెప్పాల్సి రావచ్చు. ఎందుకంటే కేంద్రం ప్రముఖ నగరాలను కలుపుతూ పోయే ప్రధాన రహదారుల్లో గంటకు రైలు వేగాన్ని 130 కిలోమీటర్ల వరకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రాక్ టెస్టింగ్ వంటి కార్యక్రమాలు పూర్తిచేశారు. అయితే వీటిలో కొన్ని గేట్లను మూసేందుకు ప్రణాళికలు చేయగా, వాటికి సంబంధించి తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ పనులపై చర్యలు ప్రారంభించారు. దాదాపుగా ఈ పనులు పూర్తయిన వెంటనే గంటకు 130 కిలోమీటర్ల వేగం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి ఆరు ప్రధాన రూట్లలో రైళ్ల వేగాన్ని గంటకు 130 కిలోమీటర్ల మేర పెంచేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రయాణికులను సకాలంలో గమ్యానికి చేర్చేందుకు ఢిల్లీ–ముంబై, ఢిల్లీ–చెన్నై, ముంబై–చెన్నై, ఢిల్లీ–హౌరా, ముంబై–హౌరా, హౌరా–చెన్నై రూట్లలో ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగాన్ని పెంచనున్నారు. వీటిలో ఢిల్లీ–ముంబై మినహా మిగిలిన ఐదు రూట్లు ఏపీ పరిధిలోనూ ఉన్నాయి. ఈ మార్గాల్లో కన్ఫర్మేటరీ ఆసిల్లోగ్రాఫ్ కార్ రన్ (సీఓసీఆర్) టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం పడుతున్న సమయం కన్నా అరగంట ఆదా
► ముంబై–చెన్నై ప్రధాన మార్గంలో గల గుత్తి–రేణిగుంట రైల్వే లైన్ మధ్య ట్రాక్ సామర్థ్యాన్ని పెంచారు. 280 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రైలు మార్గంలో టెస్ట్ డ్రైవ్ ఇప్పటికే పూర్తయింది.
► ఈ పరీక్షలో ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల సమయం కంటే అరగంట ఆదా అయింది. ఈ మార్గంలో ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్ల వేగం 90 కిలోమీటర్ల వరకు ఉంది.
► ఈ వేగాన్ని 130 కి.మీ వరకు పెంచేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
► గుంతకల్లు–రేణిగుంట మార్గంలో ఏర్పాటు చేసిన రైల్వే ట్రాక్‌పై టెస్ట్ డ్రైవ్ నిర్వహించాల్సి ఉంది. 130 కిలోమీటర్ల వేగంతో రైలు వెళుతుంటే పట్టాలు తట్టుకోగలవా అనే విషయాన్ని పరిశీలిస్తారు.
► టెస్ట్ డ్రైవ్ విజయవంతమైన తర్వాత రైల్వే భద్రత కమిషన్ (సీఆర్‌సీ) కూడా పరిశీలించి అనుమతులిస్తుంది.
► ముంబై–చెన్నై మార్గంలో ఏపీ పరిధిలోని గుంతకల్ డివిజన్ పరిధిలో 1,330.90 కి.మీ. ట్రాక్ ఉంది.
రైల్వే గేట్ల ఎత్తివేత దిశగా..
► గంటకు 130 కిలోమీటర్ల వేగం పెంచే ఈ ప్రధాన రైలుమార్గాల్లో దాదాపు రైల్వే గేట్లను ఎత్తివేసేందుకు రైల్వే ఇప్పటికే చర్యలు చేపట్టింది.
► ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న గేట్ల స్థానంలో ఆర్వోబీ (రోడ్ ఓవర్ బ్రిడ్జి)లను నిర్మిస్తోంది. పలు గేట్ల స్థానంలో ఆర్‌యూబీ (రోడ్ అండర్ బ్రిడ్జి)లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ► గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో 30 లెవల్ క్రాసింగ్ గేట్లను మూసివేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
► మూసివేయాలనుకుంటున్న ఎల్‌సీ గేట్ల స్థానంలో ఒక్కో ఆర్‌యూబీ నిర్మాణానికి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల లోపు వ్యయమవుతుందని అంచనా.