Visakhapatnam: విశాఖలో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
Visakhapatnam: నిబంధనలు ఉల్లంఘించినవారిపై కొరడా
Visakhapatnam: అనధికార ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల స్టిక్కర్లతో విశాఖలో ప్రయాణిస్తున్నారా..? పక్కా ఆధారాలు ఉన్నాయా..? ఆధారాలు ఉంటే పర్వాలేదు. లేకపోతే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు విశాఖ పోలీసులు. పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై ఖాకీలు కొరడా ఝళిపిస్తున్నారు.
విశాఖలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అనధికార ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల స్టిక్కర్లను తగిలించుకొని నడుపుతున్న వాహనాలపై చర్యలు తీసుకుంటున్నారు. రెండు రోజుల స్పెషల్ డ్రైవ్‌లో ఇప్పటివరకు 150 వాహనాలు అనధికారికంగా స్టిక్కర్లు తగిలించుకుని వెళ్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసు, ప్రెస్, ఎంపీ, ఎమ్మెల్యే, ఆర్టీవో స్టిక్కర్లు తగిలించుకొని వెళ్తున్నవారిని స్పెషల్ డ్రైవ్ లో భాగంగా పట్టుబడ్డారు. పశ్చిమ గోదావరికి చెందిన ఓ వ్యక్తి తన కారుపై ఆర్టీవో స్టిక్కర్ ను తగిలించుకుని విశాఖ సిటీలో ప్రయాణిస్తుండగా ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు ఆరా తీయగా అతను వెస్ట్ గోదావరికి చెందిన ఆర్టీఓ కాదని బయటపడింది.
మద్దిలపాలెం ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అనధికార స్టిక్కర్లు తగిలించి నడుపుతున్న వాహన చోదకులపైనే కాకుండా ట్రాఫిక్ నియమాలను పాటించని వారిపై కూడా ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపించారు. బైక్ చోదకులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని, కార్లు నడిపే వారు సీటు బెల్టు ధరించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇకపై ప్రతిరోజు ఈ తరహా స్పెషల్ డ్రైవ్ ఉంటుందని ట్రాఫిక్ ACP సీహెచ్ ఆదినారాయణ అంటున్నారు. మొదటి విడతగా కౌన్సిలింగ్ నిర్వహించి వదిలేస్తున్నామని, మరోసారి పట్టుబడితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ప్రెస్, పోలీసు స్టిక్కర్లను వాహనాలపై కలిగి ఉన్నవారు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు చూపాలని ఆదినారాయణ తెలిపారు.