ఏపీలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు
* 3,328 పంచాయతీ, 33,570 వార్డులకు ఎన్నికలు * ఉ.6.30 గంటల నుంచి మ.3.30 గంటల వరకు పోలింగ్ * సా.4 గంటల నుంచి లెక్కింపు, ఫలితాలు
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. 3వేల 328 పంచాయతీలు, 33వేల 570 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. సాయంత్రం 4 గంటల నుంచి లెక్కింపు, అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి.
ఇక.. నేటితో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. 13 జిల్లాల్లోని 19 రెవెన్యూ డివిజన్లలో 3వేల 249 పంచాయతీలు, 32వేల 502 వార్డులకు ఫిబ్రవరి 17న పోలింగ్ జరగనుంది. అనంతరం ఫలితాలు రానున్నాయి. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు అధికారులు.
మరోవైపు నాల్గో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు నేడు చివరి రోజు. దీంతో ఇవాళ భారీ గానే నామినేషన్లు దాఖలయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. 13 జిల్లాల్లోని 162 మండలాల్లో 3వేల 299 పంచాయతీలు, 34వేల 112 వార్డులకు పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి 21న జరగనున్నాయి. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.