అనకాపల్లి జిల్లాలో పులి సంచారం
Anakapalli: మూగ జీవాలను చంపుకు తింటున్న టైగర్
Anakapalli: అనకాపల్లి జిల్లా ప్రజలకు బెంగాల్ టైగర్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది . కొన్ని రోజులుగా కనిపించీ కనించకుండా దాగుడు మూతలాడుతూ మూగ జీవాలను చంపుకు తింటోంది. దీంతో అటవీ సమీప ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అనకాపల్లి జిల్లాలో గత నెల 29 నుంచి పులి సంచరిస్తుండటంతో గ్రామాల ప్రజలు భయంతో గజగజలాడుతున్నారు.
అటవీ, రెవిన్యూ శాఖ అధికారులు ధైర్యం చెబుతున్నప్పటికి భయం వీరిని వెంటాడుతోంది. తూర్పుగోదావరి జిల్లా ,ప్రత్తిపాడు నుండి బెంగాల్ టైగర్ అటవీ ప్రాంతం మీదుగా నక్కపల్లి మండలం రేబాక ,తిరుపతిపాలెం తడపర్తి వద్ద గేదె పై దాడి చేసింది. అక్కడ నుంచి కోటవురట్ల మండలం పొందూరు గ్రామంలో పులి గేదెను చంపి పక్కన ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. ఆ తర్వాత యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పెద్దపల్లి గ్రామం రిజర్వ్ ఫారస్ట్ లో అడుగు పెట్టింది. ఆహారం కోసం మళ్ళీ వస్తుందని భావించిన అటవీ శాఖ అధికారులు బోన్ ఏర్పాటు చేసారు. ఈలోగ పులి చోడవరం మండలం గంధవరం అటవీ ప్రాంతంలో ప్రత్యక్షం అయి, దూడపై దాడి చేసింది. అటవీ శాఖ అధికారులకు చిక్కకుండా చుక్కలు చూపిస్తుంది.
అనకాపల్లి జిల్లాలోని బావులువాడ సమీప ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు ప్రకటించగా, మరోచోట ప్రత్యక్షమయ్యింది. చోడవరం మండలం వెంకన్నపాలెం పెట్రోల్ బంకు ఇసుక ర్యాంపు మధ్య దిబ్బపాలెం వెళుతూ కనిపించింది. టైగర్ రోడ్డు దాటుతుండగా కొందరు ప్రయాణికులు గమనించారు. వెంటనే విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. పులి సంచారం నేపథ్యంలో అలర్ట్ అయిన అధికారులు దుడ్డుపాలెం, దిబ్బపాలెం, నరసాపురం, వెంకన్నపాలెం తదితర గ్రామాల్లో దండోరా వేయించారు. అటు నుండి యూటర్న్ తీసుకున్న టైగర్ సబ్బవరం మండలంలోకి ప్రవేశించింది. నారపాడు సమీపంలో రెండు మేకలపై దాడి చేసింది. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఒంటరిగా ఎవరూ బయటకు వెళ్లవొద్దని హెచ్చరికలు జారీ చేశారు. పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.