బాబాయ్‌కి బెయిల్ మంజూరు.. ఎవరూ పరామర్శకు రావద్దు : ఎంపీ రామ్మోహన్ నాయుడు
Ram Mohan Naidu: టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈఎస్ఐ స్కామ్ కేసులో రిమాండ్ లో ఉన్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. రూ. 2 లక్షలు షూరిటీ ఇవ్వాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లవద్దని, సాక్షులను తారుమారు చేయవద్దని, దర్యాప్తు అధికారికి అందుబాటులో ఉండాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు విడుదలపై ఎంపీ రామ్మోహన్ నాయుడు ట్వీట్టర్‌లో ట్వీట్ చేశారు.
మా బాబాయ్ అచ్చెన్నాయుడు గారికి బెయిల్ మంజూరు అయ్యింది. తెలుగుదేశం పార్టీ , కింజరాపు అభిమానుల ప్రార్థనలు ఫలించాయి. స్వచ్ఛమైన రాజకీయ జీవితంలో మచ్చలేని అచ్చెంనాయుడు రాజకీయ వేధింపులతో పెట్టిన కేసుల నుంచి మీ అందరి ఆశీస్సులతో బయటికి వస్తారని రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. బెయిల్ వచ్చినా బాబాయ్ కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దయచేసి ఎవ్వరూ పరామర్శలకు రావొద్దు. మీ అభిమానమే మాకు కొండంత అండ. బాబాయ్ కోసం ప్రార్థించిన ప్రతీ ఒక్కరికీ కింజరాపు కుటుంబం తరఫున పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కష్టకాలంలో మా కుటుంబానికి అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు, కార్యకర్తలందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను అంటూ రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ లో పేర్కొన్నారు.