బొబ్బిలి టీడీపీలో కొత్త రచ్చేంటి.. బొబ్బిలి టీడీపీలో త్వరలో ప్రకంపనలకు సంకేతాలా?
ఆయన రాజాధిరాజు. గ్రేటాధిగ్రేటు మాజీ మంత్రి. చరిత్ర కలిగిన రాజవంశీయుడు. ఎమ్మెల్యేగానూ, మంత్రిగానూ తన నియోజకవర్గపు కోటను పాలించాడు. కానీ యుద్ధంలో ఓడిన రాజులా డీలాపడిపోయారట ఆ చక్రవర్తి. కానీ రాజ్యంలో కార్యకర్తలు మాత్రం ఈ పరిణామాలను సహించలేకపోతున్నారట. కత్తి పట్టు, రాజ్యాన్ని నిలబెట్టు అంటూ ఒత్తిడి తెస్తున్నారట. ఇంతకీ భవిష్యత్తు రాజ్యంపై ఆ రాజుకు నమ్మకంలేదా? ఆయన మౌనానికి కారణాలు వేరే వున్నాయా? ఏంటవి?
విజయనగరం జిల్లాలోని బొబ్బిలి నియోజకవర్గ టిడిపి నేత, మాజీ మంత్రి సుజయ కృష్ట రంగారావు, 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారట. ఓపక్క స్థానిక సంస్థల ఎన్నికల సమీపిస్తున్న వేళ, తమ నేత నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉండటంతో కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారట. అధికార వైసిపి, నియోజకవర్గంలో తమ కేడరును బలోపేతం చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో, నియోజకవర్గంలో వారికి తగ్గట్టుదా పార్టీని బలోపేతం చెయ్యాల్సిన నాయకుడు మౌనంగా ఉండటంతో పాటు, ఆయన సోదరుడు శ్వేతా చలపతి రంగారావు కూడా నియోజకవర్గంలో పార్టీని నడిపించడంలో వెనకడుగు వేస్తున్నారట. ఈ పరిణామాలు టిడిపిని నమ్ముకున్న కార్యకర్తలకు ఆందోనకు గురిచేస్తున్నాయట.
ఓ పక్క రాచరికపు వారసులుగా సుజయ కృష్ట రంగారావుకు, ఆయన సోదరుడు శ్వేతా చలపతి రంగారావులకు నియోజకవర్గ ప్రజల్లో గుర్తింపు ఉంది. వారు ప్రజల్లోకి వెళ్లినట్లయితే మళ్ళీ పార్టీని పూర్వ వైభవాన్ని తేవచ్చని నియోజకవర్గ సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారట. అయితే ఇద్దరు రాజుల మౌనానికి కారణాలేంటో తెలియక సతమతమౌతున్నారట టిడిపి కార్యకర్తలు.
రాజరికపు వారసులుగా రాజకీయాల్లోకి వచ్చిన సుజయ కృష్ట రంగారావు వరుసగా మూడుసార్లు గెలుపొందారు. అయితే 2014 ఎన్నికల్లో వైసిపి నుంచి పోటీచేసి గెలుపొందాక, టిడిపిలో చేరి మంత్రి పదవిని చేపట్టారు. అయితే మంత్రి అయిన తర్వాత, సుజయ కృష్ట రంగారావు నియోజకవర్గ అభివద్దికి పాటుపడలేదని, దీంతో 2019 ఎన్నికల్లో ఓటమిని చవిచూశారని వినిపిస్తున్న మాట. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి నియోజకవర్గ కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోసి, పార్టీని బలోపేతం చెసేందుకు అన్నీ తానై నడిపించాల్సిన సమయంలో రాజుగారు ఇలా మౌనం దాల్చి నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు దూరంగా ఉండటాన్ని కార్యకర్తలను కలవరానికి గురి చేస్తోందట. ఇలా సుజయ కృష్ట రంగారావు అందరికీ అందుబాటులో లేకుండాపోతే, ఎన్నో యేళ్ళుగా టిడిపినే నమ్ముకుని ఉన్న పలువురు సీనియర్ నాయకులు సైతం పార్టీని వీడేందుకు సిద్దపడుతున్నారట.
ఇదే తరుణంలో సుజయ కృష్ట రంగారావు సోదరుడు శ్వేతా చలపతి రంగారావు పార్టీని వీడి బిజెపిలో చేరుతారన్న ఊహగానాలు కొంతకాలంగా నియోజకవర్గంలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే నిజమైతే శ్వేతా చలపతి రంగారావుకు తన అన్న సుజయ కృష్ట రంగారావు కంటే మంచి పట్టు ఉండటంతో ఆయనతో నడిచేందుకు కొంతమంది టిడిపి నాయకులు సిద్దమంటున్నారట. ఇప్పటికే జిల్లా టిడిపికి నడిపించే నాయకుడు లేక కొట్టుమిట్టాడుతున్న తరుణంలో, బొబ్బిలి రాజుగారి మౌనంతో జిల్లా టిడిపిని, మరింత కుంగదీసేలా ఉందని అందరినోటా వినిపిస్తున్నమాట. చూడాలి మరి, రాజుగారి మనసులో ఏముందో తన మౌనానికి, పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండటానికి కారణాలేంటో కాలమే సమాదానం చెప్పాలి.