Chandrababu fire on Kurichedu Incident: కురిచేడు దుర్ఘటనపై టీడీపీ అధినేత దిగ్భ్రాంతి
Chandrababu fire on Kurichedu Incident: ప్రకాశం జిల్లాలోని కురిచేడులో శానిటైజర్ తాగి 10 మంది మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Chandrababu fire on Kurichedu Incident: ప్రకాశం జిల్లాలోని కురిచేడులో శానిటైజర్ తాగి 10 మంది మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు జగన్ సర్కార్ బాధ్యత వహించాలనీ, మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే మద్యం మాఫియాను అరికట్టాలని సూచించారు. రాష్ట్రంలో ఇలాంటి దుర్ఘటనలు పదేపదే చోటుచేసుకోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
రాష్ట్రంలో గత 14నెలలుగా కల్తీ మద్యం దుర్ఘటనలు పేట్రేగడం బాధాకరమని, నాటు సారా తాగి, కల్తీ మద్యం సేవించి, శానిటైజర్లు తాగి పలువురు చనిపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యం ధరలు 300%పైగా పెంచేశారు. నాసిరకం బ్రాండ్లు మాత్రమే విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యం సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా పెరిగిపోయింది. గడ్డివాముల్లో, మొక్కజొన్న మోపుల్లో, లారీల్లో ఎక్కడ చూసినా అక్రమ మద్యం నిల్వలే. వైసిపి కార్యకర్తలే మొబైల్ బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మొబైల్ బెల్ట్ షాపుల సంస్కృతి తెచ్చారు. వందలాది ద్విచక్ర వాహనాలను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాక్షాత్తూ అసెంబ్లీ స్పీకర్ ధ్వజమెత్తడం తెలిసిందే. రాష్ట్రంలో అన్ని జిల్లాలలో వైసిపి మద్యం మాఫియా ఆగడాలు పేట్రేగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మాఫియాకు అమాయకుల బలికావడం బాధాకరమని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.