Taati Munjalu: చలవతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే కూల్ కూల్ ముంజలు
Taati Munjalu: భానుడి భగభగ నుంచి ఉపశమనం పొందేందుకు జ్యూసులు శీతల పానీయాలు ఏ మేరకు మేలు చేస్తాయో చెప్పలేం కానీ సమ్మర్ లో దొరికే కూల్ కూల్ తాటి ముంజులు మాత్రం ఆరోగ్యంతో పాటు చల్లదనాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు.
Taati Munjalu: భానుడి భగభగ నుంచి ఉపశమనం పొందేందుకు జ్యూసులు శీతల పానీయాలు ఏ మేరకు మేలు చేస్తాయో చెప్పలేం కానీ సమ్మర్ లో దొరికే కూల్ కూల్ తాటి ముంజులు మాత్రం ఆరోగ్యంతో పాటు చల్లదనాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. తాటి ముంజుల్లో ఉండే పోషకాలు వేసవి వేడిమి నుంచి ఉపశమనం కలిగించడతో పాటు పలు ఆనారోగ్య సమస్యలకు చక్కటి ఔషధంలా పని చేస్తాయి. మండు వేసవిలో మాత్రమే లభించే ఐస్ యాపిల్స్ పై హెచ్ఎం టీవీ స్పెషల్ స్టోరీ.
వేసవిలో సీజనల్ ఫ్రూట్స్ విరివిగా లభిస్తాయి. వాటిలో ప్రధానమైనవి తాటి ముంజులు. ప్రస్తుతం తూర్పుగోదావరి జల్లా రాజమండ్రిలో ఎక్కడ చూసినా ఇవే దర్శనమిస్తున్నాయి. వేసవిలో మాత్రమే లభించే తాటిముంజలకు ప్రత్యేకత ఉంది. తాటిముంజుల్లో తక్కువ మొత్తంలో క్యాలరీలు ఉండి అధిక మొత్తంలో శరీరానికి కావాల్సిన శక్తినిస్తాయి. కేవలం వేసవి తాపం నుంచి ఉపశమనాన్ని ఇవ్వడమే కాదు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరంపై వచ్చే చిన్నచిన్న మెటిమలను నివారించడంలో ఉపకరిస్తాయి. శరీరానికి మినరల్స్, కార్బోహైడ్రేట్స్‌తో పాటు షుగర్ కంటెంట్ తక్కువగా ఉన్న ముంజులను ఏ వయస్సు వారైనా తొనవచ్చు. ఇవి డీహైడ్రేషన్ నుంచి కాపాడతాయి.
జిల్లాలో గ్రామీణ ప్రాంతాల నుంచి తాటి ముంజులను సేకరించే రైతులు నగరాలకు తరలించి వాటిని విక్రయిస్తున్నారు. తెల్లవారు జామునే తాటిచెట్ల నుంచి ముంజులను సేకరించి రాజమండ్రి, కాకినాడ వంటి నగరాలతో పాటు పలు ప్రధాన పట్టణాల్లో విక్రయిస్తున్నారు. కేవలం వేసవిలో మూడు నెలలు మాత్రమే పరిమితంగా లభించే వీటిని విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు కొందరు రైతు కూలీలు. డజన్ తాటి ముంజులు 40 రూపాయిల నుంచి 50 రూపాయిల వరకు రేటు పలుకుతోంది. కేవలం పల్లెల్లో మాత్రమే కనిపించే ముంజులు నగరాలు, పట్టణాల్లో విరివిగా లభించడంతో రాజమండ్రి నగర వాసులు మంజుల కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఐస్ యాపిల్స్ గా పిలవబడే ఇవి మెట్ట ప్రాంతాలైన రంపచోడవరం, మారేడుమిల్లి, సీతపల్లి, జగ్గంపేటల నుంచి సేకరిస్తున్నారు వ్యాపారులు. వ్యవసాయ పనులు తక్కువగా ఉండే వేసవిలో తాటి ముంజుల విక్రయాలు కాస్తంత ఊరటనిస్తుందని అంటున్నారు. అయితే ఇటీవల పెరిగిన పెట్రోల్ రేట్ల వల్ల ముంజుల విక్రయాలు అంత లాభసాటిగా లేవని అంటున్నారు. తెల్లవారు జామున లేచి సాయంత్రం వరకు అమ్మకం జరిగితే కూలీ డబ్బులు మాత్రమే గిట్టుబాటు అవుతుందని వాపోతున్నారు. ఎంతో మేలు చేసే ఈ తాటి మంజులను తింటూ ఈ సమ్మర్ ను ఎంజాయ్ చేయండి. ఇక ఇప్పుడు మిస్ అయ్యారో మళ్లీ సంవత్సరం వరకూ ఎదురుచూడక తప్పదు మరి !