Srinivasa Varma: కేంద్ర కేబినెట్ లో చోటు దక్కించుకున్న శ్రీనివాస వర్మ

Srinivasa Varma: తొలిసారిగా పార్లమెంట్ లోకి అడుగు పెడుతున్న నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది.

Update: 2024-06-10 16:30 GMT

Srinivasa Varma: కేంద్ర కేబినెట్ లో చోటు దక్కించుకున్న శ్రీనివాస వర్మ

Srinivasa Varma: ఏపీ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొలిసారిగా పార్లమెంట్ లోకి అడుగు పెడుతున్న నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. కేంద్ర మంత్రివర్గంలో రాజమండ్రి ఎంపీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి చోటు దక్కుతుందని భావించిన పార్టీ శ్రేణులకు అనూహ్యంగా శ్రీనివాస్ వర్మకు చోటుదక్కడంతో ఒకింత ఆశ్చర్యా నికి లోనవుతున్నారు. పురందేశ్వరికి కీలకమైన పార్లమెంట్ స్పీకర్ బాధ్యతలు అప్పగిస్తున్నారనే ప్రచారం ఏపీ బీజేపీలో జోరుగా జరుగుతోంది. మూడున్నర దశాబ్దాలుగా ఏపీ బీజేపీలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించిన శ్రీనివాస్ వర్మ ఇటీవల జరిగిన ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 2లక్షల 76వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ దక్కింది. రొయ్యల సాగు, రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో మూడు దశాబ్దాలుగా ఉన్న శ్రీనివాసవర్మ డీఎన్ఆర్ కాలేజీ కార్యదర్శిగా, కరస్పాండెంట్ గానూ గతంలో వ్యవహరించారు.

1991 నుంచి 95 వరకు పశ్చిమ గోదావరి జిల్లా బీజేవైఏం అధ్యక్షుడిగా, 1995 నుంచి 97 వరకు భీమవరం పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా, 1997 నుంచి 99 వరకు పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ కార్యదర్శిగా, 1999 నుంచి 2001 వరకు నరసాపురం పార్లమెంటు కన్వీనర్ గా, 2001 నుంచి 2003 వరకు బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా, 2003 నుంచి 2009 వరకు పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ స్థానానికి బీజేపీ నుంచే పోటీ చేశారు. ఇక 2010 నుంచి 2018 వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన శ్రీనివాసవర్మ 2018 నుంచి 2020 వరకు జిల్లా ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. భీమవరం పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ గా, ఫ్లోర్ లీడర్ గానూ బీజేపీ తరఫున వ్యవహరించారు. గతంలో నర్సాపురం పార్లమెంటు స్థానం నుంచి సినీ నటులు కృష్ణంరాజు, గోకరాజు గంగరాజు గెలుపులో శ్రీనివాసవర్మ కీలకంగా వ్యవహరించడం విశేషం.

ఇక 2020 నుంచి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న శ్రీనివాసవర్మకు పార్టీ అధిష్టానం నరసాపురం పార్లమెంట్ కు అభ్యర్థిగా ఎంపిక చేసింది. నరసాపురం నుంచి మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సహా పలువురు పోటీ పడినప్పటికీ ఆర్ఎస్ఎస్ తో ఉన్న సన్నిహిత సంబంధాలు, పార్టీ పట్ల అంకిత భావం కలిగిన సీనియర్ నేత కావడంతో అధిష్టానం వర్మ వైపే మొగ్గు చూపింది. రాష్ట్రంలో బీజేపీ ఆరు స్థానాల్లో పోటీ చేసి మూడింటిలో గెలుపొందింది. అటు రాజమండ్రి నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గెలుపొందారు. ఆమెకు కేంద్ర కేబినెట్ లో బెర్త్ ఖాయం అని అందరూ ఊహించారు. మరోవైపు అనకాపల్లి నుంచి గెలిచిన రాజ్యసభ మాజీ సభ్యుడు సీఎం రమేష్ కూడా మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తొలిసారిగా గెలిచిన శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని పార్టీ నేతలు కూడా ఊహించలేదు.

బీజేపీలో కష్టపడి పనిచేసే కార్యకర్తకు అవకాశాలు ఉంటాయని చెప్పేందుకు తానే ఒక ఉదాహరణ అని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ఆనందం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇది ఆంధ్ర రాష్ట్ర బీజేపీ కార్యకర్తలు అందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు వర్మ చెప్పారు.

Tags:    

Similar News