కర్నూలు జిల్లాలో ఆ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది ఆ సెగ్మెంట్ నుంచి గెలుపొందితే చాలు కచ్చితంగా పదవి ఖాయమన్న సెంటిమెంట్. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన అభ్యర్థికి మాత్రం కేబినెట్ ర్యాంక్ పోస్ట్ మాత్రం పక్కా. ఇది మరోసారి రుజువైంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం ప్రతిపక్షంలో ఉన్నా, అధికారపక్షంలో ఉన్నా, పదవిని ప్రసాదించే కల్పవల్లి ఏంటది?
డోన్ అసలు పేరు ద్రోణాచలం. వర్గ పోరుకు, కుటుంబాల సమరానికి కేరాఫ్ అడ్రస్ అయిన కర్నూలు జిల్లాలోని డోన్ నియోజకవర్గానికి, లక్కీ సెగ్మెంట్‌గా పేరుంది. ఇక్కడ ఎవరు గెలిచినా మంత్రివర్గం లేదా కేబినెట్ హోదా పక్కా. జగన్ కొత్త కేబినెట్‌లో ఇదే విషయం మరోసారి ప్రూవ్ అయ్యిందని డోన్ నాయకులంటున్నారు.
డోన్ నుంచి పోటీ చేసి గెలిచిన వారిని ఏదో ఒక పదవి వరించటం ఆనవాయితీగా వస్తోంది. తాజా ఎన్నికల్లో గెలిచిన బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి తొలి కేబినెట్‌లోనే స్థానం లభించింది. గతంలోనూ ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన బుగ్గనకు, కేబినెట్ ర్యాంకుతో కూడిన ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పదవి కూడా దక్కింది. అందుకే ద్రోణాచలం లక్కీ సెగ్మెంట్‌గా ముద్రపడింది.
కోట్ల కుటుంబానికు కంచుకోటయిన డోన్ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. టీడీపీ నుంచి గెలిచిన కేఈ కృష్ణమూర్తి కూడా రెండు మూడు పర్యాయాలు, మంత్రిగా చేశారు. ఒకవేళ ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచి పార్టీ అధికారంలోకి రాకపోయినా ఈ నియోజకవర్గంలోని నేతలకు క్యాబినెట్ హోదా పదవులు వస్తుంటాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కేఈ కృష్ణమూర్తికి పీఏసీ చైర్మన్‌గా అవకాశం వచ్చింది. అలాగే 2014 ఎన్నికల్లో వైసిపి ఓటమి పాలైనా డోన్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి పీఏసీ చైర్మన్ వరించింది. ఇలా పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రం పదవిలో కొనసాగడం ఖాయం.
డోన్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత, మొట్టమొదటిసారిగా స్వతంత్ర అభ్యర్థిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాత బుగ్గన శేషారెడ్డి విజయం సాధించారు. కాని ఆ తర్వాత ఆ కుటుంబం నియోజకవర్గంపై పట్టు నిలుపుకోలేక పోయింది. తర్వాత కేయి కుటుంబం నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకుంది. ఆ తర్వాత కోట్ల కుటుంబం కూడా డోన్‌పై తన హవాను కొనసాగించింది. ద్రోణాచలం నియోజకవర్గంగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు గెలుపొందిన ఎమ్మెల్యేలకు దక్కిన పదవులు పరిశీలిస్తే, ఇది లక్కీ సెగ్మెంట్ అని అర్థమవుతుంది.
1978లో కేఈ కృష్ణమూర్తి కాంగ్రెస్(ఐ) తరఫున గెలిచి, ఎక్సైజ్ శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. 1985లోనూ గెలిచిన కేఈ భారీ నీటిపారుదల శాఖ మంత్రి వరించింది. అలాగే 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి, సీఎం సింహాసనం అధీష్టించారు. 1996లో కేఈ ప్రభాకర్ టిడిపి తరఫున పోటీ చేసి గెలుపొంది విద్యాశాఖ మంత్రి అయ్యారు. 1999లో కేఈ ప్రభాకర్ టిడిపి అభ్యర్థిగా గెలిచి, అటవీశాఖ మంత్రిగా, చిన్న నీటి పారుదల శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు
. 2009లో కేఈ కృష్ణమూర్తి టిడిపి తరఫున గెలుపొంది, పిఎసి చైర్మన్‌గా కొనసాగారు. 2014లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైఎస్సార్సీపీ తరఫున గెలుపొంది పిఎసి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2019లో వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి గెలుపొంది, కీలక శాఖకు మంత్రయ్యారు. ఇదీ లక్కీ నియోజకవర్గం హిస్టరీ.
ఏది ఏమైనా డోన్ నియోజకవర్గం నుంచి గెలిస్తే చాలు పార్టీ అధికారంతో సంబంధం లేకుండా పదవి రావటం ఖాయమన్న నమ్మకం, నాయకుల్లో బలంగా ఉంది. అయితే నాయకులైతే పదవులు పొందుతున్నా, ఆశించిన స్థాయిలో అభివృద్ధి కూడా జరిగితే బాగుంటుంది అనేది ప్రజల ఆకాంక్ష. మరి ఇప్పటి వరకు అధికారంలో లేకపోయినా పిఎసి చైర్మన్‌గా వ్యవహరించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రయ్యారు. మరి ద్రోణాచలాన్ని అరుణాచలంలా పాలించి, అభివృద్ది బాటలో పరుగులు పెట్టిస్తారా లక్కీ సెగ్మెంట్‌కు లక్కీ ప్రజాప్రతినిధి అనిపించుకుంటారా?