జగన్ ప్రభుత్వంపై పంచ్‌లు పేల్చిన షకీలా.. రాజకీయాల్లోకి వస్తారనడానికి ఇది ట్రైలరా?
ఆమెకు భాషాబేధం లేదు. సకల భాషల్లోనూ ఆ నటీమణికి ఒకవర్గం వీరాభిమానులున్నారు.
ఆమెకు భాషాబేధం లేదు. సకల భాషల్లోనూ ఆ నటీమణికి ఒకవర్గం వీరాభిమానులున్నారు. మళయాళ చిత్రసీమను ఒక ఊపు ఊపిన చరిత్ర ఆమెది. మమ్ముట్టి, మోహన్‌లాల్‌ను సైతం గడగడలాడించిన బాక్సాఫీసు రికార్డులు ఆమె సొంతం. అంతటి నటీమణి, ఆంధ‌్రప్రదేశ్ మూడు రాజధానుల ప్రతిపాదనపై సెటైర్ వేశారు. తన కొత్త సినిమా ట్రైలర్‌లో పంచ్‌లు కురిపించారు. ఇంతకీ ఎవరా ఎవర్‌గ్రీన్ హీరోయిన్..? ఆమె పొలిటికల్ పంచ్‌ల భావమేంటి? త్వరలో ఆమె రాజకీయాల్లోకీ వస్తారనడానికి, ఈ ట్రైలర్ టీజరా?
షకీల. పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు శృంగారదేవతగా కుర్రాళ్ల గుండెల్లో నిలిచిన తార. ఇప్పటికీ పోర్న్ స్టార్‌గా యూట్యూబ్‌లో చెక్కుచెదరని పేరు. అయితే, ఇప్పడు షకీల తన కొత్త సినిమాలో చేసిన కామెంట్లు ఆసక్తి కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయంపై పంచ్‌లు పేల్చారు షకీలా.
అలనాటి శృంగార తార షకీలా నటించిన సినిమా ట్రైలర్ ఇది. షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రమిది. ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో షకీలా పేపర్ చదువుతుంటుంది. అందులో ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులనే వార్తను ఆమె చదివి 'ఏంటి? మూడు రాజధానులా?' అని తన అసిస్టెంట్‌ని అడుగుతుంది. అవును మేడం! జగనన్న మూడు రాజధానులు చేసేశాడు అని అసిస్టెంట్ చెప్తాడు. దీంతో 'పోను పోనూ ఒక్క రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులు అయినా ఆశ్చర్యం అవసరం లేదు' అని సెటైర్ వేస్తారు షకీల. ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది.
మూడు రాజధానులపై షకీల తన సినిమాలో ఎందుకు సెటైర్ వేశారన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. షకీల ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీలో లేరు. ఏ పార్టీకీ మద్దతివ్వలేదు. అయితే, టీడీపీ వ్యతిరేకిస్తున్నట్టుగా, మూడు రాజధానులను షకీల సైతం వ్యతిరేకించారు. దీంతో తెలుగుదేశం సోషల్ మీడియా ఫాలోవర్స్, షకీల్ ట్రైలర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. షేర్లమీద షేర్లు చేస్తూ, వైసీపీ మీద షకీల సైతం సెటైర్లు వేశారంటూ, కామెంట్లు చేస్తున్నారు.
అటు షకీల ట్రైలర్‌పై వైసీపీ అభిమానులు, కార్యకర్తలు రగిలిపోతున్నారు. టీడీపీ మెప్పు కోసమే, ట్రైలర్‌లో త్రీ క్యాపిటల్స్‌ను షకీల వ్యతిరేకించారని కౌంటర్ వేస్తున్నారు. చివరకు షకీలను సైతం, మూడు రాజధానుల వివాదంలో టీడీపీ లాగిందని, ఆమెతోనూ విమర్శలు కురిపించే నీచమైనస్థాయికి దిగజారిందని కౌంటర్ వేస్తున్నారు వైసీపీ ఫాలోవర్స్. మొత్తానికి షకీల కొత్త సినిమా ట్రైలర్‌లో పంచ్‌లు, సోషల్ మీడియాలో వైసీసీ, టీడీపీ మధ్య అగ్నికి ఆజ్యంపోసినట్టయ్యింది.
ఈ సినిమా కథ షకీలానే రాశారని చెబుతున్నారు. అంటే ఈ డైలాగ్ కూడా షకీలా అభిప్రాయమే అనుకోవాలి. అంటే, షకీలాకు మూడు రాజధానులు ఇష్టంలేదన్న మాట. మరి సినిమాలో పొలిటికల్ డైలాగ్స్ వెయ్యాలంటే, అందులోనూ అధికారంలో వున్న పార్టీకి వ్యతిరేకంగా వివాదాస్పద సన్నివేశాలు పెట్టాలంటే, ధైర్యముండాలి. ఈ విషయంలో షకీలా సాహసం చేశారని సినిమా ప్రేక్షకులంటున్నారు.
పొలిటికల్ డైలాగ్స్ పేల్చిన షకీల, త్వరలో రాజకీయాల్లోకి రావడానికే ఈ డైలాగ్స్ పెట్టారా వెళ్తే ఏ పార్టీలోకి వెళతారన్నది ఆసక్తిగా మారింది. అయితే, రాజకీయాల్లోకి వెళ్తారో లేదో కాని, కేవలం సినిమా పబ్లిసిటీ కోసమే షకీల మూడు రాజధానులపై వివాదస్పద సన్నివేశాలు, డైలాగ్స్ పెట్టారని మరికొందరు సినీ విశ్లేషకులంటున్నారు. చూడాలి, శృంగారదేవతగా ఒకప్పడు సినిమాలతో కుర్రాళ్ల గుండెలు పేల్చిన షకీల, లేటెస్ట్ ట్రైలర్‌తో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో, లేదంటే ఎవరూ పట్టించుకోక సైలెంట్ అయిపోతారో.