సీఎస్ కి నిమ్మగడ్డ మరోసారి లేఖ!

ఏపీ ఎన్నికల సంఘం, జగన్ సర్కార్ మధ్య స్థానిక సంస్థల ఎన్నికల వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఎలక్షన్ జరగాల్సిందే అని ఎన్నికల సంఘం.. ఇప్పుడే వద్దని జగన్ ప్రభుత్వం.

Update: 2020-11-24 01:16 GMT

ఏపీ ఎన్నికల సంఘం, జగన్ సర్కార్ మధ్య స్థానిక సంస్థల ఎన్నికల వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఎలక్షన్ జరగాల్సిందే అని ఎన్నికల సంఘం.. ఇప్పుడే వద్దని జగన్ ప్రభుత్వం. ఈ విషయంపై ఇప్పటికే చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ రెండు సార్లు లేఖ రాశారు. ఐనా ప్రయోజనం లేకపోవడంతో ఇప్పుడు ముచ్చటగా మూడోసారి లేఖ పంపించారు. ఇంతకీ ఆ లేఖ ఏముంది. సీఎస్ ఎలా స్పందిస్తారు.?

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికలను నిర్వహించేందుకు తాము సిద్ధమని ఎన్నికల సంఘం అంటోంది. కరోనా తీవ్రత కారణంగా ఇప్పుడే ఎన్నికలు వద్దంటోంది ప్రభుత్వం. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే రెండు సార్లు చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ లేఖ రాశారు. అయితే, ఆమె నుంచి సరైన ప్రతిస్పందన రాలేదు. దీంతో, ఆమెకు నిమ్మగడ్డ రమేశ్ ముచ్చటగా మూడోసారి లేఖ రాశారు.

ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, పంచాయతీరాజ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మీటింగ్‌ వాయిదా పడుతూ వస్తోంది. సోమవారం ఏర్పాటు చేసిన మీటింగ్‌కు అధికారులు ఎవ్వరు రాలేదు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు, ఆదేశాలు లేవని అధికారులు చెబుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్‌ నిర్వహించాలని నిమ్మగడ్డ రమేశ్‌ పట్టుదలతో ఉన్నారు.

సీఎస్‌ నీలం సాహ్నికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ మరో లేఖ రాశారు. హైకోర్టు తీర్పు కాపీని లేఖకు జతచేసి పంపారు. రాజ్యాంగ బద్ధ సంస్థలకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని లేఖలో గుర్తుచేశారు. ఎన్నికల నిర్వహణ, కమిషన్ విధి నిర్వహణలో ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా ఉండాలని తీర్పులో న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వ సహకారంపై తమకు మళ్లీ నివేదిక సమర్పించాలని తీర్పులో ఎన్నికల కమిషన్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఇదే విషయాన్ని తన లేఖలో ఎన్నికల కమిషనర్ ప్రస్థావించారు.

అయితే ఈ లేఖపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం పంతం గెలుస్తుందా.. ఎలక్షన్ కమిషన్ నిర్ణయం నెగ్గుతుందా అని వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News