వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి సెర్చ్ వారంట్
Search Warrant: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇంటికి పోలీసులు సెర్చ్ వారంట్ అంటించారు.
Search Warrant: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇంటికి పోలీసులు సెర్చ్ వారంట్ అంటించారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలతో వి. రవీందర్ రెడ్డిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే రవీందర్ రెడ్డిని విచారిస్తే రాఘవరెడ్డి పేరు బయటకు వచ్చింది.
గత వారమే రాఘవరెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. కానీ, అప్పటికే ఆయన పోలీసులకు అందుబాటులో లేకుండా పోయారు. కడప జిల్లాలోని లింగాల మండలం అంబకపల్లిలోని రాఘవరెడ్డి ఇంటికి పోలీసులు సెర్చ్ వారంట్ అంటించారు. మరో వైపు వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేకానందరెడ్డికి కూడా పోలీసులు 41 ఏ నోటీసులు జారీ చేశారు.
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలతో టీడీపీ, జనసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాలోని వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ తో డొంక కదిలిందని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించిన వారికి పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. కొందరు ఇప్పటికే అరెస్టయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని టీడీపీ చెబుతోంది.