విశాఖ రిషికొండ బీచ్‌కు మహర్దశ

విశాఖపట్నం రిషికొండ బీచ్‌కు మహర్దశ పట్టబోతోంది. బీమ్స్‌ కార్యక్రమం కింద చేపట్టే బీచ్‌ల అభివృద్ధిలో భాగంగా బీచ్‌ పర్యాటకుల సౌకర్యాలకు పెద్ద పీట వేయనున్నారు.

Update: 2020-02-16 05:41 GMT

విశాఖపట్నం రిషికొండ బీచ్‌కు మహర్దశ పట్టబోతోంది. దేశంలోని 13 బీచ్‌లను అంతర్జాతీయ స్థాయి బీచ్‌లుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'బీచ్‌ ఎన్విరాన్‌మెంట్‌ & ఈస్థటిక్స్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌' ప్రాజెక్ట్‌లో రిషికొండ బీచ్‌కు చోటు దక్కినట్లు పర్యావరణశాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ స్పష్టం చేశారు.

ప్రాచీన కోస్తా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పర్యావరణహిత బీచ్‌లుగా పర్యాటకులను ఆకర్షించే బీచ్‌లను రూపొందించడం బీమ్స్‌ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దేశంలోని కోస్తా తీరం కలిగిన రాష్ట్రాల్లోని 13 బీచ్‌లను ఈ కార్యక్రమం కోసం గుర్తించారు. అందులో ఆంధ్రప్రదేశ్‌లోని రిషికొండ బీచ్‌ ఒకటి. బీమ్స్‌ కార్యక్రమం కింద చేపట్టే బీచ్‌ల అభివృద్ధిలో భాగంగా బీచ్‌ పర్యాటకుల సౌకర్యాలకు పెద్ద పీట వేయనున్నారు.

పర్యాటకుల కోసం బీచ్‌లో పర్యావరణహితమైన బయో టాయిలెట్ల నిర్మాణం, ఆధునిక స్నానాల గదులు, శుద్ధి చేసిన తాగు నీరు, పాత్‌వేస్‌, సీటింగ్‌ సౌకర్యాలు, గొడుగుల కింద కూర్చోవడానికి వీలుగా చెక్క కుర్చీలు, పిల్లల ఆట స్థలాలు, ఫిట్‌నెస్‌ పరికరాలు, ఫస్ట్‌ ఎయిడ్‌ స్టేషన్‌, క్లాక్‌ రూమ్‌ సౌకర్యం, వాహనాల పార్కింగ్‌ స్థలం, బీచ్‌ లేఔట్‌, సైనేజ్‌లు వంటి సకల సౌకర్యాలు కల్పించనున్నారు.

అలాగే బీచ్‌లో గార్డెనింగ్‌, టాయిలెట్లలో ఫషింగ్‌ కోసం నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించుకోవడానికి వీలుగా గ్రేవాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను నెలకొల్పుతారు. బయో-వేస్ట్‌ను శుద్ధిచేయడానికి వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌ను, విద్యుత్‌ అవసరాల కోసం సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నారు.


Full View


Tags:    

Similar News