ఉత్తరాంధ్రకు తప్పిన ముప్పు.. బలహీనపడిన జవాద్‌ తుపాను...

Jawad Cyclone: శ్రీకాకుళం జిల్లాపైన ఓ మోస్తరు ప్రభావం.. పలుచోట్ల వర్షాలు

Update: 2021-12-05 02:50 GMT

ఉత్తరాంధ్రకు తప్పిన ముప్పు.. బలహీనపడిన జవాద్‌ తుపాను...

Jawad Cyclone: ఉత్తరాంధ్రకు జొవాద్‌ తుపాను ముప్పు తప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తుపాను శనివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ ఇవాళ మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ తీరానికి చేరనుంది. అప్పటికి ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారనుందని వాతావరణశాఖ తెలిపింది.

తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. తుపాను ప్రభావం ఓ మోస్తరుగా శ్రీకాకుళం జిల్లాపైనే కనిపించింది. విజయనగరం జిల్లాలో పలుచోట్ల కొద్దిపాటి వర్షాలు పడ్డాయి. విశాఖపట్నం జిల్లాలోనూ భారీ వర్షాలు నమోదు కాలేదు. జవాద్‌ తుపాను ప్రభావం మన తీరంపై ప్రభావం చూపకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

ఇక తుపాను బలహీనపడి ఒడిశా వైపు కదలడంతో మన తీరంలో తేలికపాటి వర్షాలు మినహా భారీ వర్షాలకు అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు, విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి సునంద తెలిపారు. ప్రస్తుతం జవాద్‌ విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 180 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 260 కిలోమీటర్లు, పూరీకి 330 కిలోమీటర్లు, పారదీప్‌కు 420 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఇది రాగల 12 గంటల్లో మరింత క్రమంగా బలహీనపడి ఉత్తర దిశగా ప్రయాణిస్తుంది. ఆ తర్వాత ఉత్తర శాన్య దిశగా పూరీ దగ్గరకు చేరుతుంది. ఆ తర్వాత ఒడిశా కోస్తా వెంబడి ప్రయాణించి పశ్చిమ బెంగాల్‌ తీరం వైపునకు వెళ్లే అవకాశం ఉంది.

జొవాద్‌ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పలు మండలాల్లో శుక్రవారం సాయంత్రం నుంచే వానలు మొదలయ్యాయి. శనివారం కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిశాయి. కొన్నిప్రాంతాల్లో అధిక వేగంతో ఈదురుగాలులు కూడా వీచాయి.

ఒకటి రెండుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. శనివారం రాత్రి నుంచి ఆది, సోమ వారాల్లో ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురవొచ్చని అధికారులు చెప్పారు.

Tags:    

Similar News