అమలాపురంలో పోలీస్ గస్తీ.. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు పోలీసు పహారా

*అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత *బ్యాంకింగ్ సేవలకు అంతరాయం

Update: 2022-05-26 04:15 GMT

అమలాపురంలో పోలీస్ గస్తీ.. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు పోలీసు పహారా

Amalapuram: కోనసీమ జిల్లా నివురుగప్పిన నిప్పులా కన్పిస్తోంది. అల్లరిమూకల విధ్వంసం తర్వాత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులు ఆంక్షలు కొనసాగిస్తున్నారు. ఇంటర్నెట్ సేవలు బంద్, మద్యం షాపుల బంద్ చేశారు. తాజాగా రాత్రి రావుల పాలెంలో జరిగిన ఘటన తరువాత పోలీసులు అలెర్టయ్యారు. జిల్లాలో 2వేల మంది పోలీసుల పహారా నిర్వహిస్తున్నారు. కోనసీమలోకి కొత్తగా వస్తున్న ప్రతీ ఒక్కరి పూర్తి వివరాలు తీసుకున్నాక వారిని అనుమతిస్తున్నారు. అమలాపురం, రావులపాలెంలో పోలీసుల గస్తీ కొనసాగుతోంది.

మరోసారి ప్రజాప్రతినిధులు ఇళ్లపై దాడులు జరక్కుండా ఉండేందుకు జిల్లాలోని ప్రజా ప్రతినిధుల అందరి నివాసాల వద్ద అదనపు భద్రత కొనసాగిస్తున్నారు. కోనసీమలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు పోలీసుల పహారా కొనసాగనుంది. పట్టణంలో సుమారు వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు కొనసాగుతోంది. దళిత సంఘాలు ఆందోళన చేసే అవకాశం ఉందన్న సమాచారంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు. మొత్తం ఘటన తర్వాత దళిత సంఘాలు ర్యాలీ చేపట్టే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు విధ్వంసానికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 72 మంది గుర్తించగా 46 మందిని అమలాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఘటనపై ప్రాథమికంగా సుమారు 400 మందిపై కేసులు నమోదు చేశారు. అమలాపురంలో రెండవ రోజు ఇంటర్ నెట్ సేవలు నిలిపివేశారు. సోషల్ మీడియా ద్వారా ఆందోళనకు పిలుపు ఇవ్వకుండా కట్టడి చేసేందుకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బ్యాంకింగ్ సేవలు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇదిలా ఉంటే జిల్లా పేరు మార్పు విషయమై అభ్యంతరాలను స్వీకరించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమలాపురం కలెక్టరేట్‌లో స్పెషల్ కంప్లైంట్ బాక్స్ ఉంచారు. జిల్లా పేరు మార్పుపై అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశమిచ్చారు. ఈనెల 30 వరకు అభ్యంతరాలు తెలిపొచ్చని అధికారులు చెప్పారు. 

Tags:    

Similar News