రేపు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కుటుంబసభ్యులతో పాటు మంగళవారం తిరుపతి, తిరుమల పర్యటనకు రానున్నారు.
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కుటుంబసభ్యులతో పాటు మంగళవారం తిరుపతి, తిరుమల పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు భద్రత చర్యలు, వసతి సౌకర్యం పై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధమ పౌరునికి స్వాగతం పలికేందుకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిలు కూడా హాజరవుతుండటంతో రేణిగుంట ఎయిర్ పోర్టు మొదలు తిరుమల గిరుల వరకు పోలీస్ కంట్రోల్ లోకి తీసుకున్నారు. రేణిగుంట టు తిరుమల నిఘా నీడలోకి తెచ్చారు.
రాష్ట్రపతి పర్యటించనున్న ప్రాంతాలలో 24వ తేదీన ట్రాఫిక్ అంక్షలు ఉంటాయని పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే సీయస్ టూ కలెక్టర్, డీజీపీ టూ ఎస్పీ ఏర్పాట్లపై స్పష్టమైన రూట్ మ్యాపింగ్ తో సిద్దమయ్యారు. రాష్ట్రపతి తొలుత తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారిని దర్శించుకోనున్నారు. అక్కడి నుంచి పద్మావతీ అతిథి గృహం చేరుకుని అనంతరం తిరుమలకు బయలుదేరి వెళ్తారు. మద్యాహ్నం ప్రత్యేకంగా దర్శనం ఏర్పాటు చేయడంతో తిరుమల శ్రీవారి ఆలయంలో రెండు గంటల పాటు సర్వదర్శనాన్ని, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను ఆపివేశారు. రాష్ట్రపతి తిరుమల శ్రీవారిని దర్శించుకోచడానికి వస్తున్న నేపథ్యంలో టీటీడీ పగడ్భందీ ఏర్పాట్లతో సర్వసన్నద్దతతో ఉంది.