వైసీపీ, టీడీపీల మధ్య ముదురుతున్న ప్రమాణాల వివాదం

* సవాళ్లు, ప్రతిసవాళ్లతో అట్టుడుకుతున్న విశాఖ నగరం *తూర్పు నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం *ఈస్ట్ పాయింట్‌ సాయిబాబా గుడి దగ్గర భారీ బందోబస్తు

Update: 2020-12-27 03:38 GMT

వైసీపీ, టీడీపీ ప్రమాణాల సవాళ్లతో విశాఖ నగరం అట్టుడుకుతోంది. ఇరుపార్టీల చర్యలతో వివాదం మరింత ముదురుతోంది. దీంతో తూర్పు నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడిపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఇవాళ ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు వైసీపీ ఎమ్మెల్యేలు. బీచ్‌ రోడ్డులోని వైఎస్సార్‌ విగ్రహం నుంచి ఈస్ట్ పాయింట్‌ షిర్డీ సాయిబాబా ఆలయం వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. వెలగపూడి కూడా ప్రమాణం చేయడానికి రావాలని సవాల్‌ విసిరారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌‌.

అయితే.. తనపై భూ ఆక్రమణల ఆరోపణలు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి వస్తేనే.. తాను కూడా ప్రమాణం చేస్తానని మెలిక పెట్టారు ఎమ్మెల్యే వెలగపూడి. మరోవైపు ప్రమాణాల సవాళ్లు, తాజా పరిస్థితులపై తూర్పు నియోజకవర్గంలో సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు టీడీపీ శ్రేణులు. వైసీపీ, టీడీపీ సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఈస్ట్ పాయింట్‌ సాయిబాబా గుడి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

ఏపీ రాజకీయాలు ప్రమాణాల చుట్టూ తిరుగుతున్నాయి. అనపర్తి ఘటన మరువకముందే విశాఖలో మరో వివాదం తెరకెక్కింది. దీంతో ఎప్పుడూ కూల్‌గా, ఆహ్లాదకరంగా ఉండే సిటీ.. ఇప్పుడు ఒక్కసారిగా హీట్‌ ఎక్కింది. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇక.. ఈ ఘటనపై మూడ్రోజులుగా టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధాలు, ప్రమాణ సవాళ్లు చోటుచేసుకున్నాయి.

తనపై చేసిన ఆరోపణలపై ఈస్ట్ పాయింట్‌ కాలనీలో ఉన్న సాయిబాబా ఆలయంలో ప్రమాణం చేయాలని వైసీపీ నేతలకు సవాల్‌ విసిరారు ఎమ్మెల్యే వెలగపూడి. దీంతో ఆలయంలో ప్రమాణం చేసేందుకు రెండు పార్టీల నేతలు నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. అప్రమత్తమై అటు వెలగపూడి నివాసంతో పాటు సాయిబాబా గుడి దగ్గర కూడా మూడంచెల పహారా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వెలగపూడి కార్యాలయానికి టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి.. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఎమ్మెల్యే వెలగపూడి సవాల్‌కు విజయసాయి తరపున తాను సిద్ధమంటూ ముందుకొచ్చారు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ విజయనిర్మల. ఈస్ట్ పాయింట్‌ కాలనీలోని సాయిబాబా ఆలయానికి చేరుకుని.. బాబాను దర్శించుకున్నారు. అనంతరం వెలగపూడి కార్యాలయం వైపు సాయిబాబా పటంతో వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఎంవీపీ కాలనీ దగ్గర విజయ నిర్మలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని వెనక్కి పంపించారు. వెలగపూడి ప్రమాణం చేయాలని వైసీపీ నేతలు డిమాండ్‌ చేయగా.. స్పందించిన వెలగపూడి.. తాను నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నానని.. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని అన్నారు. మొత్తానికి ఇరుపార్టీల చర్యలతో విశాఖ నగరం.. ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News